అంతర్జాతీయ వేదికపై పాక్‌కు భారత్‌ షాక్..

అంతర్జాతీయ వేదికపై పాక్‌కు భారత్‌ షాక్..

జమ్మూ అండ్ కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సదస్సులో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ దీటుగా సమాధానం ఇచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా ఎవరు ఉన్నారో యావత్ ప్రపంచానికి తెలుసునని ఇండియా స్పష్టం చేసింది. అలాంటి వాళ్లే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాక్ తీరును భారత్ ఎండగట్టింది. యూఎన్‌హెచ్ఆర్‌సీలో భారత్ తరఫున హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ విజయ ఠాకూర్ సింగ్ మాట్లాడారు.

జమ్మూకశ్మీర్‌ అంతర్జాతీయ అంశమని, భారత అంతర్గత వ్యవహారం కాదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషి తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను విజయ్‌ ఠాకూర్ సింగ్ తోసిపుచ్చారు. భారత ప్రభుత్వం తీసుకున్న సార్వభౌమాధికార నిర్ణయాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారమని ఆమె కుండబద్ధలు కొట్టారు. పార్లమెంటులో ఆమోదించిన ఇతర నిర్ణయాల తరహాలోనే కశ్మీర్ విషయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, వాటిలో ఏ దేశం ప్రమేయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కశ్మీర్‌లో అభివృద్ధిపరమైన విధానాలను పూర్తిగా అమలు చేయనున్నామని ఠాకూర్ సింగ్ చెప్పారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ పూర్తిగా తప్పుడు కథనాలు, కట్టుకథలు ప్రచారం చేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఎవరు కేంద్ర స్థానంగా నిలుస్తున్నారో, ఉగ్రవాదులకు ఆశ్రయం, నిధులు ఎవరు అందిస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసునని పాక్‌ తీరును ఈ సందర్భంగా ఠాకూర్ సింగ్ ఎండగట్టారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, అమలు చేసినా అవి పూర్తిగా భారతీయ చట్టాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్ తేల్చిచెప్పింది.