నవ్వులు పూయిస్తూనే ఉన్న నరేశ్

నవ్వులు పూయిస్తూనే ఉన్న నరేశ్

ఇప్పటికీ నవ్వులు పూయిస్తూనే ఉన్నారు నరేశ్. ఈ తరం వారికి 'సీనియర్ నరేశ్'గా గుర్తున్న నరేశ్ ఒకప్పుడు హీరోగా చేసిన సందడినీ ఎవరూ మరచిపోలేరు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన 'ప్రేమసంకెళ్ళు'తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన 'నాలుగు స్తంభాలాట' (1982)లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు సంపాదించారు. విజయనిర్మల సైతం బాలనటిగా అలరించిన తరువాత కథానాయికగానూ మెప్పించారు. దాంతో అందరూ తల్లికి తగ్గ తనయుడు అంటూ నరేశ్ ను అభినందించారు. 

జంధ్యాల హీరోగా...

హిందీ 'లవ్ స్టోరీ' ఆధారంగా విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రేమసంకెళ్ళు' తరువాత విడుదలయింది. కానీ, అది అంతగా అలరించలేకపోయింది. జంధ్యాల దర్శకత్వంలోనే రూపొందిన "రెండు జళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, శ్రీవారి శోభనం, మొగుడుపెళ్ళాలు, చూపులు కలసిన శుభవేళ, హై హై నాయకా, బావా బావా పన్నీరు, ప్రేమ ఎంత మధురం" వంటి చిత్రాలలో నవ్వులు పూయిస్తూనే సాగారు నరేశ్. వీటిలో 'పుత్తడి బొమ్మ'లో 'మూగమనసులు'లోని ఏయన్నార్ లాంటి బరువైన పాత్ర ధరించారు. కానీ, అది జనం ముందు దరువు వేయలేకపోయింది. జంధ్యాల దర్శకత్వంలో  పది చిత్రాలలో నటించినా, వాటిలో మూడు సినిమాలే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగలిగాయి. ఇక జంధ్యాల శిష్యుడు ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నరేశ్ హీరోగా రూపొందిన 'జంబలకిడిపంబ' పేరుకు తగ్గట్టే నవ్వులతో పంబరేగ గొట్టింది. పి.యన్. రామచంద్రరావు రూపొందించిన 'చిత్రం భళారే విచిత్రం' (1992)లో స్త్రీ పాత్రలో నరేశ్ అనితరసాధ్యంగా అలరించారు. వంశీ తెరకెక్కించిన 'శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్'(1987)లోనూ నరేశ్ అల్లరి భలేగా ఆకట్టుకుంది. గుణశేఖర్ 'సొగసు చూడతరమా' (1995)లోనూ నరేశ్ నటన మురిపించింది. ఆ తరువాత నరేశ్ హీరోగా నటించిన చిత్రాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. దాంతో తెలివిగా కేరెక్టర్ రోల్స్ లోకి షిఫ్ట్ అయ్యారు నరేశ్. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కితకితలు పెడుతూనే ఉన్నారు.

ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ జనానికి మరింతగా నవ్వులు పంచుతారని ఆశిద్దాం.