విజయమే నిర్మల లక్ష్యం!

విజయమే నిర్మల లక్ష్యం!

నటిగా, దర్శకురాలిగా ఆ తరం వారిని అలరించారు విజయనిర్మల... లేడీ డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన విజయనిర్మల ఈ తరం వారి మదిలోనూ చోటు దక్కించుకున్నారు... ఫిబ్రవరి 20న విజయనిర్మల జయంతి... 

విజయనిర్మల పేరు తలచుకోగానే ఆమె పతిదేవుడు కృష్ణ కూడా గుర్తుకు వస్తారు. ఆయన చర్చ వచ్చినప్పుడు ఈమె కూడా గుర్తుకు రాకమానరు. అలా ఒకరి ఒకరుగా నిలిచి నటులుగానే కాదు, నిర్మాతలుగా, దర్శకులుగా రాణించిన జంట చిత్రసీమలో విజయనిర్మల-కృష్ణ కాక మరొకరు కానరారు. 

మేడ్ ఫర్ ఈచ్ అదర్!
'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనే మాట తరచూ వింటూ ఉంటాం... కానీ, విజయనిర్మల, ఆమె భర్త నటశేఖర కృష్ణను చూస్తే ఆ మాట నూటికి నూరుపాళ్ళు  నిజం అనిపించక మానదు... 
 కృష్ణ, విజయనిర్మల జంట దాదాపు నలభైకి పైగా చిత్రాల్లో అలరించారు... కృష్ణకు తొలి హిట్ పెయిర్ ఎవరూ అంటే విజయనిర్మల పేరే వినిపిస్తుంది... కొన్ని చిత్రాల్లో వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్ళుగానూ అభినయించారు... అయితే వారు జంటగా నటించిన సినిమాలే ప్రేక్షకులకు కన్నుల పండుగ చేశాయి. కృష్ణ, విజయనిర్మల జంట ఉందంటే చాలు ఆ రోజుల్లో యువత థియేటర్లకు పరుగులు తీసేవారు... 

ముహూర్తబలం
కృష్ణ, విజయనిర్మల తొలిసారి నాయకానాయికలుగా నటించిన చిత్రం 'సాక్షి'... ఈ సినిమా వీరిద్దరికీ ప్రథమం కాగా, ప్రముఖ చిత్రకారుడు బాపుకు దర్శకునిగా మొదటి చిత్రం... ఇందులో కృష్ణ, విజయనిర్మల జోడీ నటించిన తీరు జనాన్ని ఆకట్టుకుంది... వారిద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాలు సైతం ప్రేక్షకులను మెప్పించాయి... తొలి సినిమాలోనే కృష్ణ చేత మూడు ముళ్ళు వేయించుకొనే పాటలో విజయనిర్మల నటించారు... ఏ ముహూర్తాన ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారో కానీ, నిజజీవితంలో విజయనిర్మల, కృష్ణ భార్యాభర్తలుగా మారారు.కృష్ణకు నిజంగానే విజయనాయికగా మారారు విజయనిర్మల. వారిద్దరూ జంటగా నటించిన చిత్రాలు వరుసగా జనం ముందు నిలుస్తూ వచ్చాయి. దాంతో ఈ జోడీకి రోజు రోజుకూక్రేజ్ పెరుగుతూ వచ్చింది. అప్పట్లో కృష్ణ సంవత్సరానికి పన్నెండు చిత్రాలలో నటించేవారు. ఓ యేడాది ఒకటి రెండు సినిమాలు మినహా అన్నిటా కృష్ణ, విజయనిర్మల జంటనే కనిపించి కనువిందు చేసింది..

ఆయనకు ఆమె... ఆమెకు ఆయన...
కృష్ణ ప్రతి మైలురాయిలోనూ విజయనిర్మల పాత్ర ఉందని చెప్పక తప్పదు... ఆయన కెరీర్ లో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'టక్కరి దొంగ - చక్కనిచుక్క'. అందులో చక్కని చుక్కగా అలరించారు విజయనిర్మల. కృష్ణ పలు చిత్రాల్లో నటిస్తున్నా, ఆయనకు స్టార్ డమ్ అంత ఈజీగా లభించలేదు... ఆ సమయంలో కృష్ణ సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు తమ అన్నతో జనాన్ని ఆకట్టుకొనే కథలతో చిత్రాలు నిర్మించాలని తలచారు. తొలి ప్రయత్నంగా వారు తీసిన 'అగ్నిపరీక్ష' అంతగా ఆకట్టుకోలేదు. తరువాత హాలీవుడ్ మూవీస్ ఇన్ స్పిరేషన్ తో 'మోసగాళ్ళకు మోసగాడు' రూపొందించారు. తెలుగునాట ఇదే తొలి కౌబోయ్ మూవీ కావడం విశేషం. ఈ చిత్రంలోనూ విజయనిర్మల నాయికగా నటించారు. ఈ చిత్రంతోనే కృష్ణ తనకంటూ  అభిమానులను సంపాదించుకోగలిగారు. 
కృష్ణ సాహసాలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తూ, వాటిలో తానూ పాలుపంచుకున్నారు విజయనిర్మల. కృష్ణ 100వ చిత్రంగా రూపొందిన 'అల్లూరి సీతారామరాజు'లో నాయిక విజయనిర్మలనే. తెలుగు చిత్రసీమలో తొలి సినిమాస్కోప్ అండ్ ఈస్ట్ మన్ కలర్ లో రూపొందిన చిత్రంగా 'అల్లూరి సీతారామరాజు' నిలచింది. ఇక కృష్ణ కెరీర్ లోనే ఆ సినిమా ఓ మరపురాని మధురం. ఆ జ్ఞాపకాల్లో విజయనిర్మల పాత్రను తలచుకోకుండా ఉండలేం. ఆ సినిమా అనూహ్య విజయం సాధించి, పీరియడ్ మూవీస్ లో ఈ నాటికీ ఓ మైల్ స్టోన్ గా నిలచే ఉంది. 

'అల్లూరి సీతారామరాజు'తో అఖండ విజయం సాధించారు కృష్ణ. అప్పటి దాకా స్టార్ గానే సాగిన కృష్ణను ఈ సినిమా నటునిగానూ మంచి మార్కులతో నిలిపింది. ఈ సినిమా సంపాదించి పెట్టిన ఇమేజ్ కృష్ణకు శాపంగానూ మారింది. 'అల్లూరి సీతారామరాజు' తరువాత ఆయన నటించిన అన్ని చిత్రాలూ పరాజయం పాలయ్యాయి. మళ్ళీ  'పాడిపంటలు'తో కృష్ణ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ఇందులోనూ విజయనిర్మలనే నాయిక కావడం విశేషం. 

దర్శకురాలిగా...
కృష్ణ ప్రోత్సాహంతోనే విజయనిర్మల దర్శకత్వం చేపట్టారు. తొలుత మళయాళంలో మెగాఫోన్ పట్టి సినిమా తీశారు. ఆ సినిమా ఇచ్చిన స్థైర్యంతో యద్దనపూడి సులోచనారాణి నవల 'మీనా' ఆధారంగా అదే పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో దర్శకురాలిగానూ విజయనిర్మల విజయం సాధించారు. ఇందులో ఆమె పతిదేవుడు కృష్ణనే కథానాయకుడు. ఇప్పటికీ విజయనిర్మల పేరు తలచుకోగానే గుర్తుకు వచ్చే సినిమాలలో 'మీనా' ముందు వరుసలో ఉంటుంది. 
కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు సంపాదించడానికి విజయనిర్మల ప్రోత్సాహమే కారణమని అందరికీ తెలుసు. భర్తలో ఉన్న సాహసమే భార్య విజయనిర్మలోనూ ఉందని చెప్పవచ్చు. ఏయన్నార్ ను మహానటునిగా నిలిపిన 'దేవదాసు' కథనే రంగుల్లో తన భర్త హీరోగా రూపొందించాలన్న ఆలోచన కలిగింది విజయనిర్మలకు. అప్పట్లో అందరూ ఆ యోచన మానుకోమన్నారు. అయినా మొండిపట్టుతో తన భర్త హీరోగా 'దేవదాసు'ను సినిమా స్కోప్ -ఈస్ట్ మన్ కలర్'లో తెరకెక్కించారు. ఈ సినిమా పరాజయం పాలయినా, కృష్ణ, విజయనిర్మల దంపతుల డేర్ నెస్ ను చాలామంది అభినందించారు. 

విజయనిర్మల దాదాపు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక కథాచిత్రాలు రూపొందించిన దర్శకురాలిగా  గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు.  విజయనిర్మల దర్శకత్వం వహించిన చిత్రాలలో ఎక్కువ సినిమాల్లో కృష్ణనే హీరోగా నటించారు. 'హేమాహేమీలు'లో ఏయన్నార్ ను డైరెక్ట్ చేశారు విజయనిర్మల. అలాగే 'రామ్ రాబర్ట్ రహీమ్'లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఆమె దర్శకత్వంలో నటించారు. ఇక ఆమె డైరెక్షన్ లో కృష్ణ నటించిన 'సాహసమే నా ఊపిరి' చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. 
తన విజయం వెనుక ఉన్నది భర్త కృష్ణ అని సగర్వంగా చెప్పుకొనేవారు విజయనిర్మల. అలాగే తన విజయాల వెనుక విజయనిర్మల ఉన్నారని కృష్ణ సైతం అంగీకరించేవారు.  అలా ఈ దంపతులు తెలుగు చలనచిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు.