నాగోలులో నేడు విజయారెడ్డి అంత్యక్రియలు

నాగోలులో నేడు విజయారెడ్డి అంత్యక్రియలు


అబ్దుల్లాపుర్ మెట్ ఎమ్మార్వో హత్య తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకు నిరసనగా మూడు రోజుల పాటు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది రెవిన్యూ ఉద్యోగుల అసోసియేషన్. మరోవైపు ఎమ్మార్వో హత్యకు ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ .హైదరాబాద్‌ నాగోలులో విజయారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. 7 ఎకరాల భూవివాదం ఎమ్మార్వో విజయారెడ్డిని బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిని నిందితుడు సురేష్ ఎమ్మార్వో ఆఫీస్ లోనే సజీవ దహనం చేశాడు. నిందితుడు కూడా అరవై శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మార్వో హత్యతో రెవిన్యూ సంఘాలు భగ్గుమన్నాయి.

నిందితుడు సురేష్ తమ అదుపులోనే ఉన్నాడని పోలీసులు చెప్పారు. అతడు కోలుకోగానే కఠినంగా శిక్షిస్తామన్నారు. మృతి చెందిన ఎమ్మార్వో విజయారెడ్డికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. తల్లి చనిపోవడంతో ఇద్దరూ మాతృప్రేమకు దూరమయ్యారు. అటు సురేష్ కుటుంబ సభ్యులు కూడా జరిగిన ఘటనతో షాకయ్యారు. ఉదయం పదకొండు గంటల వరకు ఇంట్లోనే ఉన్న సురేష్.. మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో కాల్ చేశామని, ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే  జరిగిన ఘోరం తెలిసిందన్నారు. 
అటు నిందితుడు సురేష్ పెదనాన్నను పోలీసులు అనుమానిస్తున్నారు. హైకోర్టులో స్టే ఉన్న భూమిని.. ఎమ్మార్వో తమ ప్రత్యర్థులకు బదలాయించిందని ఆయన ఆరోపించారు.