కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయి లేఖ..

కేంద్ర ఎన్నికల సంఘానికి విజయసాయి లేఖ..

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఓవైపు ఈవీఎంల మొరాయింపు, పనితీరు, ఇతర విషయాలపై సీఎం చంద్రబాబు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే.. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని..స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించాలని, అన్ని స్ట్రాంగ్ రూమ్ లలో 24 గంటలు సీసీ టీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించవద్దని ముఖ్యమంత్రే నేరుగా సీఈవోకు చెబుతున్నారని ఆరోపించిన సాయిరెడ్డి... రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులకు బదులుగా కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.