జగ్గారెడ్డి వ్యాఖ్యలకు రాములమ్మ కౌంటర్

జగ్గారెడ్డి వ్యాఖ్యలకు రాములమ్మ కౌంటర్

కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు, జగన్ తో పాటు కేసీఆర్ కూడా కూటమిలో చేరుతారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తాయని అన్నారు. 'ఓవైపు స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావో, రేవో తేల్చుకునే విధంగా పోరాడుతున్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడబోయే యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ కూడా చేరబోతోందని చెబితే, స్ధానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ కు మేలు జరుగుతుంది. యూపీఏ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్ధితి ఉంటే టీఆర్ఎస్  తో పాటు వైసీపీ మద్దతు అవసరం ఉండదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు గెలవలేనప్పుడే యూపీఏలో లేని పార్టీల మద్దతు కోసం ఆలోచించాల్సి ఉంటుంది. ఓవైపు పూర్తి మెజారిటీతో కేంద్రంలో రాహుల్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వం ఏర్పడుతుందని హైకమాండ్ నేతలు చెబుతుంటే, దానికి భిన్నంగా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హైకమండ్ మాటల కంటే, టీఆర్ఎస్, వైసీపీ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్న కేసీఆర్ మాటలను ఆయన విశ్వసిస్తున్నారేమో? కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రకటనలు చేయడం భావ్యం కాదు' అని విజయశాంతి పేర్కొన్నారు.