ఇంధనం లేకుండా హెలికాప్టర్‌లో ప్రయాణమా?

ఇంధనం లేకుండా హెలికాప్టర్‌లో ప్రయాణమా?

అసలే ఎన్నికల హడావిడి... సభలు, ర్యాలీలో పాల్గొనాల్సిన సమయం... ఇలాంటి సమయంలో స్టార్‌ క్యాంపెయినర్స్ త్వరగా చేరుకునేందుకు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు... కానీ, అలాంటి సమయంలో హెలికాప్టర్‌లో ఇంధనం అయిపోతే? అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, విజయశాంతికి ఎదురైంది. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో జైనూర్ బహిరంగ సభలో పాల్గొన్న ఇద్దరు నేతలు... అక్కడ ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున ప్రచారంలో పాల్గొన్నారు... అనంతరం నేతలు తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో హెలికాప్టర్‌ ఇంధనం లేదని గుర్తించారు. దీంతో రోడ్డు మార్గంలో నేతలు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మొదట వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మార్లవాయిలో నిలిపివేశారనే సమాచారం వచ్చినా... స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెలికాప్టర్‌లో ఇంధనం లేదని తెలిసింది. అయితే ఇంధనం వచ్చే వరకు హెలికాప్టర్‌కు తగిన భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు కనీసం ఇంధనం కూడా ఇన్‌ టైంలో సమకూర్చలేకపోయారా? అంటే ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అసలే హెలికాప్టర్ ప్రయాణం కాబట్టి... కొన్ని సార్లు ఇబ్బందులు తప్పవని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.