రాముడికి కూడా ప్రాంతీయవాదమా..? రాములమ్మ ఫైర్‌

రాముడికి కూడా ప్రాంతీయవాదమా..? రాములమ్మ ఫైర్‌

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతోంది.. అయితే, విరాళాల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. అయితే, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ నేత విజయశాంతి... దేవుళ్ళకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం టీఆర్‌ఎస్‌ నేతలకే చెల్లు.. దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరచి అయోధ్య రాముడు... తెలంగాణ రాముడంటూ భేదభావాన్ని సృష్టిస్తున్నారు.. అంటూ మండిపడ్డారు.. అది చాలక అయోధ్య రామాలయానికి విరాళాలివ్వద్దని తమ ద్వేష మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు.. విరాళాన్ని భిక్షం అంటూ ఆరాధ్య భావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి తేడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారని ఎద్దేవా చేశారు. 

ఇక, మన దగ్గర రాముడి ఆలయాలు లేవా... అంటున్న ఆ టీఆర్‌ఎస్‌ నేత... ఇళ్ళలోనే పూజామందిరాలు ఉన్నప్పుడు గుళ్ళకు... పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం దేనికో చెప్పాలని ప్రశ్నించారు.. ఇలా తలతిక్కగా మాట్లాడి అహంకారాన్ని ప్రదర్శించే టీఆర్‌ఎస్‌ నేతలను ప్రజలు తప్పక ఇళ్ళకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలి.. అంటూ జోస్యం చెప్పిన విజయశాంతి.. జై శ్రీరాం అంటూ ట్వీట్‌ చేశారు. కాగా, అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చిన కోరుట్ల టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే.. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, దీంతో.. కొత్త నాటాకనికి తెర లేపుతున్నారంటూ ఘాటుగా  స్పందించారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులా..? అని ప్రశ్నించిన ఆయన.. తామంతా శ్రీరాముని భక్తులమేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.