రోజా గురించి సీఎం జగన్‌కు రాములమ్మ సలహా..!

రోజా గురించి సీఎం జగన్‌కు రాములమ్మ సలహా..!

నగరి నుంచి రెండో సారి విజయం సాధించి ఏపీ కేబినెట్‌ మంత్రి పదవి ఆశించి భంగపడిన ఆర్కే రోజా విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహాఇచ్చారు. సీఎం జగన్ కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించడం.. ఓ మహిళకు హోంశాఖ కేటాయించడంపై ప్రశంసలు కురిపించన విజయశాంతి.. మరోవైపు తెలంగాణ కేబినెట్‌లో మహిళా మంత్రులు లేకపోవడంపై సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. సోషల్ మీడియాలో స్పందించిన రాములమ్మ... "ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం మీదే టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారిస్తున్నారు.. కానీ, తెలంగాణకు సంబంధించిన ప్రధాన సమస్యల మీద ఆయన దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు దాటిపోతున్నా ఇంకా పరిష్కారం కాని సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయి.. మిగిలిన విషయాలను పక్కన పెడితే తెలంగాణలో మహిళా మంత్రులకు అవకాశం ఇవ్వకుండా ఐదేళ్ల కాలాన్ని గడిపేసిన కెసిఆర్ గారు... రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం మీద విమర్శలు వెల్లువెత్తాయి. కెసిఆర్ గారికి మాత్రం ఈ విషయంపై పెద్దగా పట్టింపు లేకపోవడం మహిళలపై  ఆయనకున్న ఉదాసీనతకు  నిదర్శనం. పొరుగు రాష్ట్రమైన ఏపీలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కనీసం దీనిని చూసిన తర్వాత అయినా కేసీఆర్ గారు మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా? లేక గత ఐదేళ్ల కాలంలో మహిళా మంత్రులకు స్థానం ఇవ్వకుండా కేబినెట్లో కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ సందర్భంగా ఏ. పి.క్యాబినెట్ కూర్పుపై కూడా నా అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను. మిగిలిన మహిళలకు అవకాశాలు కల్పించడంతో పాటు... సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని  ను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో నైనా జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను'' అంటూ వరుస ట్వీట్లు చేశారు విజయశాంతి.