విజయవాడలో దారుణం...భార్యను నరికి చంపి తలతో రోడ్డు మీదకు !

విజయవాడలో దారుణం...భార్యను నరికి చంపి తలతో రోడ్డు మీదకు !


విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వివాదాల కారణంగా తన భార్యతో విడిపోయిన ఒక వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరుచేసి చేత్తో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఈ దారుణ ఘటన గురించి తెలియకున్నా రక్తం కారుతున్న తలను పట్టుకుని రోడ్డు మేదకి వచ్చిన అతన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

పెద్దపెద్దగా కేకలు వేయడంతో అతడు భార్య తలను సమీపంలోని బుడమేరు కాల్వలో పడేశాడు. అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడకు చెందిన ప్రదీప్ కుమార్‌ కు మణిక్రాంతి అనే యువతితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే పెళ్లైన కొద్దిరోజులకే వీరిద్దరికీ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మనస్పర్థలు ఎక్కువయ్యాక మణిక్రాంతి భర్తను వదిలి తన తల్లి దగ్గరికి వెళ్లిపోయింది. తన భర్తతో ఇక పొసగదని భావించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు కూడా తుది దశకి చేరుకుంది. అయితే అప్పటికే ఓ కేసులో విచారణ ఖైదీగా ఉన్న ప్రదీప్ ఇటీవలే బెయిల్‌ మీద విడుదలై వచ్చాడు.

అయితే భార్య తనను వదిలి వెళ్ళడం, విడాకుల కేసు గెలిచేట్టు ఉండడంతో ఆమె మీద పగ పెంచుకున్న అతడు ఆమెను ఎలా అయినా కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం తన తల్లితో కలిసి రోడ్డు మీద వెళ్తున్న మణిక్రాంతిని దారుణంగా నరికి చంపాడు. అక్కడితో కసి తీరక ఆమె తలను మొండెం నుండి వేరు చేశాడు. ఆమె తల తీసుకుని రోడ్డు మీద వెళ్తుండగా గమనించిన స్థానికులు గట్టిగట్టిగా కేకలు వేయగా ఆ తలను బుడమేరులోకి విసిరేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడానికి వెళ్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తన భర్త నుండి ప్రాణహాని ఉందని మణిక్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని అయినా పోలీసులు సరిగా పట్టించుకోలేదని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.