బెజవాడ పోలీసుల మెడకు మర్డర్ కేసు ?

బెజవాడ పోలీసుల మెడకు మర్డర్ కేసు ?

బెజవాడ పోలీసుల మెడకు కారు తగల బెట్టిన కేసు చుట్టుకునేలా ఉంది. ఎందుకంటే నిందితుడు వేణు గోపాల్ రెడ్డిని పీఎస్ కు ప్రైవేటు వాహనంలో పోలీసులు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఒక కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయగా ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు, ఓ వీఆర్ కానిస్టేబుల్ కి సీపీ చార్జి మెమో ఇచ్చినట్టు చెబుతున్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ సమీపంలో ఓ చోట కారు ఆపి కృష్ణారెడ్డి, గంగాధర్, నాగవల్లి, వేణుగోపాల్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యవహారాలను చర్చించుకున్నారు.

అయితే ఈ చర్చల్లో తేడా రావడంతో వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహంతో కారు నుంచి బయటకు దిగారు. ఆ వెంటనే క్షణాల్లో కారుపై ముందే తెచ్చి ఉంచుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించారు. కార్ లాక్ వేసి ఉండడంతో గంగాధర్, నాగవల్లి స్వల్ప గాయాలతో బయటపడగా ముందు సీట్లో ఉన్న కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన కృష్ణారెడ్డితో వేణుగోపాల్ రెడ్డి రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. విజయవాడ వెటర్నరీ కాలనీలో ఉండే గంగాధర్, ఆయన భార్య నాగవల్లి బీఆర్టీఎస్ రోడ్డులో కార్ల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పరిచయాలు పెరగడంతో నలుగురు కలిసి వ్యాపారం మొదలు పెట్టినట్టు చెబుతున్నారు.