ఆ కలెక్టర్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష చేయాలి: విజయసాయి

ఆ కలెక్టర్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష చేయాలి: విజయసాయి

చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు లై డిటెక్టర్‌ పరీక్ష చేస్తే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌ అక్రమాలు బయటకు వస్తాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులను విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతల బృందం కలిసింది. అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో చేసిన అరాచకాలను సీఈసీ దృష్టికి తీసుకువెళ్లమన్నారు. తన పేషీలో పనిచేసిన ప్రద్యుమ్నను చంద్రబాబు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా నియమించాక.. ఆయనతో తెలుగుదేశం నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. 

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ మనుషులు 7 పోలింగ్‌ బూత్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడడ్డారని. పోలింగ్ ఆఫీసర్‌ను కూడా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న బెదిరించారని విజయసాయిరెడ్డి చెప్పారు. దళితులు ఓటేయకుండా అడ్డుకున్న ప్రద్యుమ్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరామన్నారు. ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించిన 5 పోలింగ్ కేంద్రాల్లో 2014లో టీడీపీకే మెజారిటీ ఓట్లు పడ్డాయన్నారు.  అనంతపురం జిల్లా రాప్తాడుకు సంబంధించి ఆర్వో.. స్థానిక మంత్రి సునీతకు తొత్తుగా వ్యవహరించి ఎన్నిక రోజు అరాచకాలకు పాల్పడ్డారని.. అతడిపి కౌంటింగ్ విధుల నుంచి తక్షణమే తొలగించాలని కోరామని విజయసాయిరెడ్డి చెప్పారు. 

'రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు, రౌడీలను పోలింగ్ ఏజెంట్లు.. కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించారు. తమకు అనుకూలంగా ఫలితాలు రాకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయించి.. రాష్ట్రంలో అరాచకాలు చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను అడ్డుకోవాలని కోరాం' అని తెలిపారు.