'చంద్రబాబు ఎందుకంత వణికిపోతున్నారు..?'

'చంద్రబాబు ఎందుకంత వణికిపోతున్నారు..?'

సోలార్, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం పున:పరిశీలన చేస్తానంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఎందుకు వణికిపోతున్నారని వైసీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ట్వీట్‌ చేశారు. కమీషన్లు తీసుకుని చంద్రబాబు చేసుకున్న పీపీఏల వల్ల ఏటా 2,500 కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్మేలా విమర్శలు చేయడం సరికాదని విజయసాయి అన్నారు. 

అమరావతికి ప్రాధాన్యతనివ్వడం లేదని బాబు శోకాలు పెడుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో జగన్‌కి బాగా తెలుసని అన్నారు. పెట్టుబడులు తెస్తానని చంద్రబాబు 38 దేశాల్లో పర్యటించడంతో రూ.39 కోట్ల ప్రజాధనం ఖర్చయిందని... ఇంతకూ ఏం తెచ్చారని అడిగితే 16 లక్షల కోట్లకు ఒప్పందాలు చేసుకుని వచ్చామని అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి వంద కోట్లు కూడా రాలేదన్న ఆయన.. 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామనడం కూడా అబద్ధమేనని అన్నారు.