మూవీ రివ్యూ : విజేత

మూవీ రివ్యూ : విజేత

నటీనటులు :  కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, మురళీ శర్మ, నాజర్, రాజీవ్ కనకాల, సత్యం రాజేష్ తదితరులు. 

ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్ 

సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్ 

నిర్మాత : సాయి కొర్రపాటి 

దర్శకత్వం : రాకేష్ శశి 

రిలీజ్ డేట్ : 12-07-2018

1984 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత రిలీజ్ అయింది.  అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్.  అదే టైటిల్ తో ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేతగా వచ్చాడు.  చిరంజీవి అల్లుడు నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.  మరి ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ ఎలా మెప్పించాడో ఇప్పుడు చూద్దాం. 

కథ : 

బాధ్యత కలిగిన మధ్యతరగతి తండ్రైన మురళీశర్మ తన ఇష్టాఇష్టాలను పక్కన పెట్టి కుటుంబం కోసం బతుకుతుంటాడు.  తనకు ఎంతో ఇష్టమైన ఫొటోగ్రఫీని పక్కన పెట్టి, ఒక స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు.  మురళీశర్మ కొడుకు కళ్యాణ్ దేవ్ అత్తెసరు మార్కులతో ఇంజినీరింగ్ పూర్తచేసి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు.  ఎంత ప్రయత్నించినా ఉద్యోగం  దొరకదు.  అల్లరి చిల్లరిగా తిరిగి గొడవలు పడుతుండటంతో..  చేతికి అందిన ఉద్యోగాలు కూడా రాకుండా పోతుంటాయి.  దీంతో మురళీశర్మ బాగా కృంగిపోతాడు.  కొడుకు ఎప్పుడు ఎదుగుతాడా అని ఆలోచిస్తుంటారు.  ఇవేమి పట్టని కళ్యాణ్ బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు.  అదే సమయంలో ఆ కాలనీలో ఉండే మాళవిక నాయర్ ప్రేమలో పడతాడు.  కొడుకు గురించి దిగులు పెట్టుకున్న మురళీ శర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.  తండ్రిని హాస్పిటల్ కు తీసుకెళ్లే సమయంలో కళ్యాణ్  ఇబ్బందులు ఎదుర్కొంటాడు.. ఈ ఇబ్బందుల తరువాత కళ్యాణ్ మారాడా? తండ్రి విలువ.. బాధ్యతల విలువ తెలుసుకున్నాడా..? తనలో మార్పు ఎలా వచ్చింది..? అన్నదే మిగిలిన కథ.  

విశ్లేషణ : 

పిల్లల కోసం తమ స్వర్వస్వాన్ని త్యాగం చేస్తుంటారు.  తల్లిదండ్రులు సాధించలేకపోయిన, కోల్పోయిన జీవితాన్ని పిల్లలకు తిరిగి ఇవ్వాలనే సందేశం ఇచ్చే సినిమా ఇది.  ఇలాంటి కథలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి.  అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లలను మంచి మార్గంలో నడిచి.. కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు అనే కాన్సెప్ట్ తో గతంలో సినిమాలు వచ్చాయి.  విజేత కూడా ఆ కోవకు చెందిన సినిమానే.  క్లుప్తంగా చెప్పాలంటే ఇది తండ్రి కొడుకుల మధ్య జరిగే ఓ ఎమోషనల్ డ్రామా.  అల్లరిగా తిరుగుతూ ఫైట్స్ గట్రా  చేస్తున్న వ్యక్తిని పెద్దగా ఎలివేట్ చేయకుండా.. కథను కథలాగా మరింత బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు.  మొదటి అర్ధభాగం అంతా తండ్రికి కొడుకుపై ఉన్న ప్రేమ, కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగం, ఆకతాయితనం, బాధ్యతలేని వ్యవహారం.. ఇలా వీటి చుట్టూ సినిమా నడుస్తుంది.  ఫస్ట్ హాఫ్ సరదాగా ఉండే కథ.   సెకండ్ హాఫ్  పూర్తిగా మారిపోయింది.  తండ్రి కోసం కొడుకు పడే ఆరాటం, ఎమోషన్స్ వీటి చుట్టే కథ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్అవుతుంది .  క్లైమాక్స్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. తండ్రి కొడుకుల అనుబంధానికి ఈ సినిమా అద్దం పడుతుంది అనడంలో సందేహం లేదు.   భారీ ఫైట్లు, కడుపుబ్బా నవ్వించే కామెడీ ఇందులోపెద్దగా కనిపించవు.  ఒక కుటుంబం చక్కగా కూర్చొని చూడదగ్గ సినిమా ఇది.  ఇలా  అందరికి కనెక్ట్ అయ్యే సినిమాలు అరుదుగా వస్తుంటాయి.  

నటీనటుల పనితీరు : 

మెగా కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి కళ్యాణ్ దేవ్ పై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది.  ఆ ఫోకస్ ను కళ్యాణ్ దేవ్ రీచ్ అయ్యే ప్రయత్నం చేశాడు.  కొంతవరకు సక్సెస్ అయ్యాడు.  నటన కొత్తే అయినప్పటికీ.. ఎటువంటి ఇబ్బందులు పడలేదు.  మొదటి సినిమా కాబట్టి పెర్ఫార్మన్స్ పరంగా మెప్పించాడని చెప్పొచ్చు.  హీరోయిన్ పాత్రలో నటించిన మాళవిక నాయర్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.  గ్లామర్ గా కనిపించింది.  సినిమా మొత్తం మీద ఎక్కువ మార్కులు కొట్టేసిన వ్యక్తి మురళీ శర్మ.  ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమాకు మురళీ శర్మనే హీరో.  తండ్రి పాత్రకు ప్రేక్షకుల మంచి మార్కులు పడ్డాయి.  నాజర్, రాజీవ్ కనకాల పృద్వీలు ఎవరి స్థాయిలో  వారి మెప్పించారు.  

సాంకేతికం :

రాకేష్ శశి కథ కథనాలు బాగా రాసుకున్నాడు.  ఏదైతే కాగితం మీద పెట్టాడో, దానిని తెరపైన అద్భుతంగా చూపించాడు.  ఎమోషన్స్ ను చిత్రీకరించడంలో రాకేష్ శశి తన మార్క్ ను చాటుకున్నాడు.  సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ బాగుంది.  భావోద్వేగాలను కెమెరాలో బంధించిన తీరు బాగుంది.  పాటలు బాగున్నాయి.  నిర్మాత సాయి కొర్రపాటి ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కించాడు.  

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

కథనాలు 

కళ్యాణ్ దేవ్ 

మురళీ శర్మ 

క్లైమాక్స్ 

మైనస్ పాయింట్స్ : 

స్లో నేరేషన్ 

ఫస్ట్ హాఫ్ 

చివరగా :  మెగా కుటుంబానికి మాస్  ఫాలోయింగ్ ఎక్కువ.   మాస్ కు  నచ్చే అంశాలు ఉంటె సినిమాను ఆదరిస్తారు.  మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేతలో మాస్  ఎలివేషన్ అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి.  పూర్తిగా ఎమోషన్స్, కుటుంబ కథను తీసుకొని తీసిన ఈ సినిమాను మెగా  అభిమానులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.