దుమారం రేపుతోన్న వికాస్ దూబే వ్య‌వ‌హారం.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు..

దుమారం రేపుతోన్న వికాస్ దూబే వ్య‌వ‌హారం.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు..

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌‌ దూబే వ్యవహారం.. యూపీ పోలీసు శాఖలో పెను దుమారం రేపుతోంది. తనను అరెస్ట్‌ చేయడానికి వస్తున్న ఎనిమిది మంది పోలీసుల్ని పొట్టనపెట్టుకున్నాడు వికాస్‌ దూబే. దీనిపై సీరియస్ గా ఉన్న యూపీ ప్రభుత్వం.. కఠినమైన చర్యలకు ఆదేశించింది. దీంతో వికాస్ దూబే లింకులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు.. ఆ గ్రామంలో ఎంటర్ అయ్యారన్న సమాచారాన్ని.. పోలీసులే అందించినట్లు బయటపడింది. ఎనిమిది మంది సహచరుల మృతికి కారణం డిపార్ట్ మెంట్ వారే అని తేలడంతో.. ఇంటి దొంగలపై విచారణ వేగంగా కొనసాగుతోంది.

డిపార్ట్‌మెంట్‌లోని వ్యక్తుల పాత్రపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులకు.. విస్తుపోయే సమాచారం అందుతోంది. వికాస్ దూబేకి ఎంతమంది పోలీసులతో సంబంధాలు ఉన్నాయో తెలుసుకుని.. పోలీసు ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు. కాన్పూర్‌లోని చౌబేపూర్, బీహౌర్, కక్వాన్, శివరాజ్ పూర్ పోలీసు స్టేషన్లకు చెందిన సుమారు 200 మందికి పైగా పోలీసులపై దర్యాప్తు జరుపుతున్నారు.  చౌబేపూర్ పోలీసు స్టేషన్ లో ప్రస్తుతం పని చేస్తున్నవారితో పాటు గతంలో పని చేసిన వారు కూడా.. దూబే వల్ల ఏదో విధంగా ప్రయోజనం పొందినవారేనని తెలుస్తోందన్నారు. దూబే పారిపోవడానికి వీరిలో చాలామంది సహకరించినట్టు తెలుస్తోంది.

చౌబేపూర్ పోలీసు స్టేషన్ కి చెందిన పది మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. మరోవైపు కొంతమంది రాజకీయ నేతలతో తనకు సంబంధాలు ఉన్నట్లు స్వయంగా వికాస్ దూబే చెప్పిన వీడియో..  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. జులై 2వ‌ తేదీన వికాస్ దూబే.. స్థానిక పోలీసులకు ఫోన్ చేసి బెదిరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తనను అరెస్ట్ చేయడానికి వస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంమీద వికాస్‌ దూబే వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేసేకొద్దీ అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని అనేక దందాలు చేసిన వికాస్ దూబే.. ఇంతకాలం రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వల్లే రెచ్చిపోతూ వచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ పై  60కి పైగా కేసులున్నాయి. ఆయనకు రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.