పాండ్యా, రాహుల్ పై రెండు వన్డేల వేటు?

పాండ్యా, రాహుల్ పై రెండు వన్డేల వేటు?

టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ల కష్టాలు తీరేలా లేవు. ‘కాఫీ విత్ కరణ్’ చాట్ షోలో వీళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యల కారణంగా వీళ్లపై రెండు వన్డేల నిషేధం వేటు పడేలా ఉంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ ఇద్దరు ఆటగాళ్లపై రెండు మ్యాచ్ ల నిషేధం విధించాలని సిఫార్సు చేశారు. మరోవైపు సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ ఈ వ్యవహారాన్ని బీసీసీఐ లీగల్ సెల్ పరిశీలనకు పంపారు.

‘కాఫీ విత్ కరణ్’ చాట్ షోలో మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరుతూ బీసీసీఐ జారీ చేసిన షోకాజ్ నోటీస్ కి హార్దిక్ పాండ్యా సమాధానం ఇచ్చాడు. బుధవారం షోకాజ్ నోటీస్ కి సమాధానం ఇస్తూ ‘టీవీ షోలో మహిళలపై సెక్సిస్ట్, స్త్రీలను కించపరిచే విధంగాచేసిన వ్యాఖ్యలకు వినమ్రపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని’ చెప్పాడు. తన వ్యాఖ్యలు అసభ్యంగా ఉన్నట్టు తనకు తోచలేదన్నాడు. ‘నేనొక చాట్ షోలో పాల్గొంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాను. అవి కించపరిచే విధంగా ఉన్నట్టు చెప్పారు. ప్రేక్షకుల మనోభావాలు గాయపరిచినందుకు సవినయంగా క్షమాపణలు కోరుతున్నానని’ తెలిపాడు. 

25 ఏళ్ల టీమిండియా ఆల్ రౌండర్ వన్డే, టీ20 సిరీస్ లు ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. తన వ్యాఖ్యలపై టీమ్ మేనేజ్ మెంట్, సహచరులను పాండ్యా క్షమాపణలు కోరినట్టు తెలిసింది. మరోసారి ఈ విధంగా ప్రవర్తించనని హామీ ఇచ్చినట్టు సమాచారం. ‘కాఫీ విత్ కరణ్’ షోలో హార్దిక్ పాండ్యా అమ్మాయిలు, మహిళలపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తింది.