బ్రేక్ దర్శనాలకు మంగళం.. టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

బ్రేక్ దర్శనాలకు మంగళం.. టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. నేటి నుంచి ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను ప్రక్షాళన చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎల్1, ఎల్2, ఎల్3 విధానాన్ని నేటి నుంచి రద్దుచేస్తున్నామని ప్రకటించారు. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం కలిగించడంలేదని చెప్పారు. 2012 నుంచి అమల్లో ఉన్న విధానం ఇక కనుమరుగు కానుంది. వీఐపీల దర్శనానికి ప్రత్యామ్నాయాల అన్వేషనలో టీటీడీ ఉంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో ఎంత మందికి దర్శనం కల్పించాలనే దానిపై టీటీడీ కసరత్తు చేస్తోంది. 

వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ప్రక్షాళన చేస్తామన్న ఆయన.. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తుల దర్శనాలకు ఆటంకం ఉండబోదన్నారు. అయితే, వీఐపీ బ్రేక్ దర్శనాలను అంచెలంచెలుగా కుదిస్తామని.. ప్రస్తుతం బ్రేక్ దర్శనాలను 3 గంటల నుంచి గంటన్నరకు కుదించనున్నట్టు ప్రకటించారు. 2012కు ముందున్న విధానాన్ని పునరుద్ధరిస్తామన్న వైవీ సుబ్బారెడ్డి.. గతంలో బ్రేక్ దర్శనాలతో దళారీ వ్యవస్థ పెరిగిందని.. అది ఆధారాలతో సహా బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్‌లా నేను రాష్ట్రాన్ని దోచుకోలేదు.. స్వామివారి డబ్బు రూపాయి కూడా ఖర్చుపెట్టను.. అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చుపెడతానని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.