ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ మరో రికార్డు...

ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ మరో రికార్డు...

ఈ ఏడాది యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ 2020లో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 146 పరుగుల లక్ష్యాన్ని చెన్నై18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. చెన్నై మ్యాచ్‌లో కోహ్లీ సిక్స్‌ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 200వ సిక్సర్‌ను సాధించాడు. చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 17వ ఓవర్‌ మూడో బంతిని ముందుకొచ్చిన కోహ్లీ సిక్స్‌ సాధించాడు. ఫలితంగా ఐపీఎల్‌లో రెండొందల సిక్సర్లు కొట్టిన జాబితాలో విరాట్ కూడా చేరిపోయాడు.

2008లో ఐపీఎల్ ప్రారంభం అయింది. మొదటి సీజన్‌ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు‌కే ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 187 మ్యాచ్‌లు ఆడాడు.  5,777 పరుగులు చేశాడు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటివరకు 499 ఫోర్లు, 200 సిక్సర్లు బాదాడు కోహ్లీ. ఐపీఎల్ 2020 జరుగుతున్న సమయంలోనే విరాట్ కోహ్లీ టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు. టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్‌గా, మొత్తంగా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు.