కెప్టెన్ గా కోహ్లి మరో రికార్డ్

కెప్టెన్ గా కోహ్లి మరో రికార్డ్

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు నాటింగ్ హామ్ టెస్టులో 203 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ని ఓడించి ఘనంగా ఐదు టెస్టుల సిరీస్ లో ఉత్కంఠని సజీవంగా నిలిపింది. ఐదు టెస్టు మ్యాచ్ ల ఈ సిరీస్ లో టీమిండియా 1-2తో మాత్రమే వెనకబడి ఉంది. ఈ విజయంతో విరాట్ కెప్టెన్ గా మరో రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. 

చివరి రోజున విజయం
నాటింగ్ హామ్ టెస్ట్ మ్యాచ్ ఐదో రోజున భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ టెయిలెండర్ జేమ్స్ ఆండర్సన్ వికెట్ తీసి ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్ కి 317 పరుగుల దగ్గర ఎండ్ కార్డ్ వేశాడు. దీంతో టీమిండియా 203 పరుగుల భారీ ఆధిక్యంతో టెస్టు నెగ్గింది. భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో విరాట్, రహానేల వీరోచిత బ్యాటింగ్ విన్యాసాలతో 329 పరుగులు చేసింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తుఫాన్ బౌలింగ్ కి ఇంగ్లిష్ బ్యాటింగ్ తుత్తునియలైంది. 

ధోనీ తర్వాత కోహ్లీనే 
నాటింగ్ హామ్ టెస్టులో గెలుపుతో విరాట్ కోహ్లీ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత జట్టుకి నాయకత్వం వహించిన అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన 38 టెస్టుల్లో భారత్ 22 మ్యాచ్ లు గెలిచింది. దీంతో 21 విజయాలతో రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని విరాట్ వెనక్కి నెట్టేశాడు. గంగూలీ నాయకత్వంలో 49 టెస్టులు ఆడిన భారత జట్టు 21 టెస్టుల్లో నెగ్గింది. 13 ఓడిపోగా 15 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.

అందరి కంటే ధోనీ టాప్  
ఇప్పటి వరకు భారత జట్టుకి అత్యంత విజయవంతమైన నాయకుడిగా మహేంద్ర సింగ్ ధోనీ ప్రథమ స్థానంలో ఉన్నాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా 60 మ్యాచ్ లు ఆడితే వాటిలో 27 విజయాలు సాధించింది. 18 ఓడిపోయి 15 మ్యాచ్ లలో డ్రాతో సరిపెట్టుకొంది.

కెప్టెన్ గా కోహ్లీదే మంచి రికార్డ్
కెప్టెన్ గా కోహ్లీ సాధించిన విజయాల శాతం ధోనీ, గంగూలీ కంటే మెరుగ్గా ఉంది. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ కేవలం 7 టెస్టులు మాత్రమే ఓడిపోయింది. 9 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. మహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్ గా భారత్ 47 మ్యాచ్ లు ఆడితే 14 విజయాలు సాధించింది. మరో 14 మ్యాచుల్లో ఓడింది. 19 డ్రాగా ముగిశాయి.