కోహ్లీ ఒంటరిగా కప్పు గెలవలేడు

కోహ్లీ ఒంటరిగా కప్పు గెలవలేడు

వరల్డ్ కప్ 2019కి టీమిండియా బుధవారం లండన్ చేరుకుంది. జట్టుకి నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ గణాంకాలు అద్భుతంగా ఉన్నప్పటికీ అతనొక్కడే జట్టుకి ప్రపంచ కప్ గెలిపించలేడని టీమిండియా మాజీ దిగ్గజ బ్యాట్స్ మెన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఒక ఆటగాడు ఒక మ్యాచ్ గెలిపించగలడేమో కానీ ఒక జట్టు మాత్రమే టోర్నమెంట్ గెలవగలదని సచిన్ భారత జట్టుకి సూచించాడు.

6 ప్రపంచ కప్ లలో టీమిండియా సభ్యుడిగా ఆడిన సచిన్ టెండూల్కర్ ' చాలా సార్లు ఒక ఆటగాడో, ఇద్దరు ఆటగాళ్లో మ్యాచ్ ని గెలిపించగలరు. కానీ ఇలా మీరు టోర్నమెంట్ గెలవలేరు. ఎక్కడో ఒక చోట ఏదైనా పెద్ద మ్యాచ్ ఓడిపోయి టోర్నమెంట్ నుంచి బయటికి రావాల్సి ఉంటుందని' చెప్పాడు. అలాగే భారత జట్టులో నాలుగో స్థానంపై కూడా మాస్టర్ బ్లాస్టర్ ఆందోళన వ్యక్తం చేశాడు.

టెస్టులు, వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ' నాలుగో స్థానంలో ఆడే బ్యాట్స్ మెన్ చాలా మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఈ స్థానంలో మీరు సర్దుకోవాల్సి ఉంటుంది. ఒక్క నెంబర్ ఫోర్ మాత్రమే కాదు మన బ్యాట్స్ మెన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలరు. తమ సామర్థ్యం మేరకు ఆడాల్సి ఉంటుంది. పరిస్థితులను అర్థం చేసుకొని నెంబర్ నాలుగుగా రుజువు చేసుకోవాలని' అన్నాడు.

బ్యాటింగ్ కి అనుకూలంగా నియమాలు, పిచ్ లు, రెండు కొత్త బంతులు వంటి వాటిని అంగీకరించబోనని సచిన్ స్పష్టం చేశాడు. పాత బంతితో బౌలర్లకు స్వింగ్ రావడం మొదలవుతుందని, 25 ఓవర్ల తర్వాత వారికి కొత్త బంతి ఇవ్వడం సబబు కాదని టెండూల్కర్ చెప్పాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్, పాకిస్థాన్ వన్డే సిరీస్ ని గుర్తు చేస్తూ ప్రతి మ్యాచ్ లో 45 ఓవర్లలోనే దాదాపు 350 పరుగులు చేశారని తెలిపాడు. అలాంటపుడు బౌలర్లు నిస్సహాయులవుతారని అభిప్రాయపడ్డాడు.

కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ జోడీ ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టడం ఖాయమని సచిన్ అన్నాడు. వీళ్లిద్దరూ తమ మణికట్టు స్పిన్ తో అద్భుతాలు చేస్తారని చెప్పాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ వీరి బౌలింగ్ కి అలవాటు పడినప్పటికీ కంగారు పడాల్సిందేమీ లేదని ధైర్యం చెప్పాడు. యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉన్న టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకొస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు.