ఇన్‌స్టాగ్రామ్‌లో కొల్లగొడుతున్న కోహ్లి

ఇన్‌స్టాగ్రామ్‌లో కొల్లగొడుతున్న కోహ్లి

టెస్టు, వన్డే, టి-20.. ఫార్మాట్‌ ఏదైనా టాప్ లేపుతున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. అటు ఆటలోనూ ఇటు వివిధ మార్గాల ద్వారా ఆదాయంలోనూ అందనంత ఎత్తుకి ఎదుగుతున్నాడు విరాట్. సోషల్ మీడియాలో కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడిదే అతనికి సరికొత్త ఆదాయ మార్గంగా మారింది. సామాజిక మాధ్యమాలలో విరాట్ ఒక పోస్టు పెట్టి కోట్లు కొల్లగొడుతున్నాడు. ఉదాహరణకు ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫోటో పోస్ట్‌ చేస్తే అందుకు అక్షరాలా రూ.82 లక్షలు అందుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తోన్న వారి జాబితాను హాపర్ హెచ్‌క్యూ సంస్థ విడుదల చేసింది. క్రీడాకారుల జాబితాలో కోహ్లీ 9వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 17వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టాప్‌–10లో ఉన్న ఏకైక క్రికెటర్‌ కోహ్లినే.

ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌ను దాదాపు 2 కోట్ల 32 లక్షల మందికి పైగా ఫాలోవర్లు అనుసరిస్తున్నారని హాపర్ హెచ్‌క్యూ తెలిపింది. ఇంత పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న కారణంగా కోహ్లీ ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన పోస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే ఆ కంపెనీ 1,20,000 అమెరికన్ డాలర్లు కోహ్లికి ముట్టచెబుతుంది. కోహ్లీ అమెరికా బాస్కెట్ బాట్ సూపర్ స్టార్ స్టీఫెన్ కరీ, ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైరైన ఫ్లాయిడ్ మేవెదర్ లను వెనక్కి నెట్టేశాడు. క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉండగా... నైమర్, మెస్సీ తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు. ఒకప్పటి సాకర్ సూపర్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగడం విశేషం.