అనూహ్యంగా కోహ్లీకి దాదా మద్దతు..!

అనూహ్యంగా కోహ్లీకి దాదా మద్దతు..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనూహ్యంగా మద్దతు తెలిపారు భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ... టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపికలో కెప్టెన్‌గా విరాట్‌కు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని తెలిపారు దాదా. అయితే, వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందు మీడియా సమావేశంలో హెడ్‌కోచ్ రవిశాస్త్రితో కలిసి మాట్లాడిన టీమిండియా కెప్టెన్... కొత్త కోచ్‌పై ప్రశ్నించిన సమయంలో... రవి శాస్త్రితో జట్టులోకి అందరికీ మంచి అనుబంధం ఉందని.. ఆయననే మళ్లీ కోచ్‌గా కొనసాగిస్తే చాలా సంతోషిస్తామని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ఇక్కడే అసలు చిక్కొచ్చింది. కోహ్లీ వ్యాఖ్యలను పలువురు ఖండించారు.. కోచ్ ఎంపిక ప్రక్రియ ఓవైపు సాగుతున్న తరుణంలో కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే, గంగూలీ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచారు. కెప్టెన్‌గా జట్టుకు సంబంధించి ఏ విషయాలోనైనా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు కోహ్లీకి ఉందని స్పష్టం చేశారు గంగూలీ. కాగా, 2017లో కోచ్‌ల ఎంపికలో కీలకంగా పనిచేశారు సౌరవ్... ఓ దశలో రవిశాస్త్రిని తీసుకురావడం ఆయనకు ఇష్టంలేదనే చర్చ జరిగింది.. ఎలాగైనా అనిల్ కుంబ్లేనే హెడ్‌కోచ్‌ను చేయాలని ఆయన పట్టుబట్టారనే విమర్శలు వినిపించాయి. కానీ, చివరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌ అయిపోయిన విషయం తెలిసిందే. గతంలో విరాట్-రవిశాస్త్రి కాంబినేషన్‌పై ఆయనకు అంతగా నమ్మకంలేదనే వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు అనూహ్యంగా కోహ్లీకి మద్దతు తెలిపారు దాదా.