కప్ పోయినా.. మన ర్యాంకులు పదిలమే..!

కప్ పోయినా.. మన ర్యాంకులు పదిలమే..!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ముగిసింది.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనే టీమిండియా వెనుదిరిగింది. కానీ, ర్యాంకుల పరంగా మన ఆటగాళ్లు టాప్ ర్యాంకింగ్స్‌లోనే కొనసాగుతున్నారు. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లను పరిశీలించిన తర్వాత తాజా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది ఐసీసీ. తొలిసారి వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టు 125 పాయింట్లతో టాప్‌స్పాట్‌లో నిలిచింది. సెమీస్‌తోనే ఇంటిముఖం పట్టినా.. ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకుల్లో పెద్దగా మార్పులు జరగలేదు. బ్యాటింగ్‌ విభాగంలో విరాట్‌ కోహ్లీ 886 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా... 881 పాయింట్లతో రోహిత్‌ శర్మ సెకండ్ స్పాట్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో 809 పాయింట్లతో జస్ప్రీత్‌ బుమ్రా టాపర్‌గా నిలిచాడు. వరల్డ్ కప్‌ తర్వాత ఇతర జట్ల ఆటగాళ్ల ర్యాంకులు మారాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 796 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచాడు. మరోవైపు టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఏకంగా 24 స్థానాలు ఎగబాకి.. 108వ స్థానంలోకి జంప్ అయ్యాడు. ఫైనల్లో తన జట్టుని విజయంవైపు నడిపించిన బెన్‌స్టోక్స్‌ 694 పాయింట్లతో టాప్‌20లో స్థానం దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్‌ జాబితాలో బంగ్లాదేశ్‌ ఆటగాడు షకిబ్ టాప్ స్పాట్‌లో ఉండగా.. స్టోక్స్‌ సెకండ్ స్పాట్‌కు చేరాడు.