రేపు కోహ్లీ వాళ్లిద్దరి రికార్డు బద్దలు చేస్తాడా?

రేపు కోహ్లీ వాళ్లిద్దరి రికార్డు బద్దలు చేస్తాడా?

టీమిండియా తన తర్వాత మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్ తో రేపు ఆడనుంది. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చిరస్మరణీయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విరాట్ ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే ప్రపంచ క్రికెట్ లో ఇద్దరు దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టినవాడవుతాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 20,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు.

భారత కెప్టెన్ కోహ్లీ అత్యంత వేగంగా 20,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయి చేరుకోడానికి ఇంకా 104 పరుగుల దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కేవలం 415 ఇన్నింగ్స్ లో 131 టెస్టులు, 222 వన్డేలు, 62 టీ-20 మ్యాచ్ ల్లో 19,896 పరుగులు చేశాడు. దీంతో అతను క్రికెట్ ప్రపంచంలో ఇద్దరు అగ్రశ్రేణి దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ కి చెందిన బ్రయాన్ లారాల సంయుక్త రికార్డును చెరిపేయనున్నాడు. లారా, సచిన్ లకు 20,000 అంతర్జాతీయ పరుగులు చేసేందుకు 453 ఇన్నింగ్స్ పట్టాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 468 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయి చేరుకున్నాడు.

ఈ వరల్డ్ కప్ లో విరాట్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతను మూడు మ్యాచ్ లలో రెండు అర్థ శతకాలు చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆడిన మొదటి మ్యాచ్ లో 18 పరుగులకు ఔటయ్యాడు. ఆస్ట్రేలియాతో 82, పాకిస్థాన్ తో 77 పరుగులు చేసి వర్తమాన ప్రపంచ క్రికెట్ లో అంతా తననెందుకు అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా పరిగణిస్తారో చాటుకున్నాడు. 

ప్రపంచ కప్ 2019లో కోహ్లీ సచిన్ టెండూల్కర్ అత్యంత వేగంగా 11,000 వన్డే పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డును పాక్ మ్యాచ్ లో అతను సాధించాడు. భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్ లు గెలవగా న్యూజిలాండ్ తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఒక పాయింట్ వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లో టీమిండియా ఫ్యాన్స్ కోహ్లీ తన మొదటి సెంచరీ చేయాలని, అత్యంత వేగంగా 20,000 అంతర్జాతీయ పరుగుల రికార్డును సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు.