కోహ్లికి పాలీ ఉమ్రిగర్‌ ట్రోఫీలు

కోహ్లికి పాలీ ఉమ్రిగర్‌ ట్రోఫీలు

బెంగళూరులో వైభవంగా బీసీసీఐ అవార్డుల వేడుక ముగిసింది. ఈ అవార్డుల వేడుకలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి అవార్డుల పంట పండింది. 2016-17, 2017-18 సీజన్లకు ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎంపికయిన కోహ్లికి పాలి ఉమ్రిగర్‌ ట్రోఫీలతో బోర్డు సత్కరించింది. టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ఈ అవార్డును కోహ్లీకి  అందజేసారు. 2016-17, 2017-18 సీజన్లలో వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లందరూ అవార్డులు అందుకున్నారు. పర్వేజ్‌ రసూల్‌, కృనాల్‌ పాండ్య ఉత్తమ దేశవాళీ ప్రదర్శన చేసినందుకు అవార్డులను అందుకున్నారు. మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన గత రెండు సీజన్లకు ఉత్తమ క్రికెటర్ల పురస్కారాల్ని  అందుకున్నారు.

మరోవైపు అన్షుమన్‌ గైక్వాడ్, సుధా షాలకు 'సీకే నాయుడు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌' అవార్డులు దక్కాయి. అయితే ఈ వేడుకలో ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌, పటౌడీ స్మారక ఉపన్యాసాన్నిచ్చారు. గురువారం చిన్నస్వామి స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఏకైక టెస్టు ఆడనుంది. ఈ చారిత్రక టెస్టు కోసం భారత్‌కు వచ్చిన అఫ్ఘాన్‌ జట్టు క్రికెటర్లు కూడా బీసీసీఐ బోర్డు అవార్డుల వేడుకకు హాజరయ్యారు.