రిషభ్ పంత్ బదులు దినేష్ కార్తీక్ కి ఛాన్స్ ఎందుకంటే...

రిషభ్ పంత్ బదులు దినేష్ కార్తీక్ కి ఛాన్స్ ఎందుకంటే...

ఇంగ్లాండ్ లో మే 30 నుంచి క్రికెట్ లో అతిపెద్ద పోటీ ఐసీసీ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. దీంతో అన్ని జట్లు తమ సన్నాహాలను దాదాపుగా పూర్తి చేశాయి. తుది 15 మంది ఆటగాళ్ల జాబితాను కూడా సిద్ధం చేసుకున్నాయి. టీమిండియా విషయానికొస్తే ఐపీఎల్ 2019కి ముందే సెలెక్టర్లు భారత జట్టులోని 15 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. ఇందులో అందరూ రెండో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఎంపికపైనే తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. యువ ఆటగాడు రిషభ్ పంత్ కి అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దినేష్ కార్తీక్ ని ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పంత్ స్థానంలో కార్తీక్ ని ఎందుకు ఎంపిక చేశారో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించాడు.

జట్టు ప్రకటనకు ముందు అంతా పంత్ కి టీమ్ లో చోటు ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ కెప్టెన్ కోహ్లీ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనుభవం, ఒత్తిడి సమయాల్లో ఆడగల సామర్థ్యం కారణంగానే పంత్ కి బదులు కార్తీక్ కి ప్రాధాన్యత ఇచ్చినట్టు వివరించాడు. 2004లో భారత్ జట్టులో డెబ్యూ చేసిన కార్తీక్, ఇప్పటి వరకు దాదాపుగా 100 వన్డేలు ఆడాడు. మే 23 వరకు జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ చాలా మంది ఈ వరల్డ్ కప్ లో భారత జట్టుకి పంత్ లేని లోటు తప్పకుండా కనిపిస్తుందని చెబుతున్నారు.

మొదటి వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా ఎంఎస్ ధోనీని ఎంపిక చేశారు. ఏదైనా కారణం చేత అతను మ్యాచ్ ఆడలేకపోతే కార్తీక్ ఆ స్థానంలో జట్టులోకి వస్తాడు. టీమిండియా ఇప్పటి వరకు రెండు సార్లు వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ సారి కూడా కోహ్లీ సేనను టైటిల్ ఫేవరెట్ గా భావిస్తున్నారు. ఈ మహాసంగ్రామంలో టీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.