విశాఖలో మంత్రి గంటా ఇంటి ముట్టడి

విశాఖలో మంత్రి గంటా ఇంటి ముట్టడి

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ పరం చేయవద్దంటు విశాఖలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంటిని ముట్టడించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల గురించి మాట్లాడడానికి వస్తే పోలీసులతో అడ్డుకోవడమేంటని మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు ఇవ్వకపోయినా, కేవలం వచ్చే వెయ్యి రూపాయలతోనే పూట గడుపుతున్నామని అన్నారు. ఈ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆందోళన బాటపట్టామని యూనియన్ నాయకులు తెలిపారు. అగస్టు 6లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగడంతో పాటు చలో విజయవాడ కార్యక్రమం జరుపుతామని హెచ్చరించారు.