ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు రద్దు

ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలు రద్దు

ఆంధ్రప్రదేశ్ లో బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించిన జీవోలను రద్దుచేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తవ్వకాలు జరపడం సరికాదన్నారు. బాక్సైట్‌ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక నుంచి  ఏజెన్సీలో మైనింగ్‌ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. యువకులు మావోయిస్టులుగా మారకుండా గిరిజన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజనుల జీవనోపాధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, నెలకోసారి అన్ని శాఖల అధికారులూ మావోయిస్టు ప్రాంతాల్లోకి వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి సేవలందుతున్నాయన్న భావన గిరిజనుల్లో కలగాలన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేస్తామని సీఎం వైఎస్ జగన్ అనేక సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం కొలువుదీరిన నెలలోపే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.