మూవీ రివ్యూ : 'అభిమన్యుడు'

మూవీ రివ్యూ : 'అభిమన్యుడు'

నటీనటులు : విశాల్, అర్జున్, సమంత, ఢిల్లీ గణేష్, 'రోబో' శంకర్ తదితరులు 

ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్ 

సంగీతం : యువన్ శంకర్ రాజా 

దర్శకత్వం : పి.ఎస్. మిత్రన్

నిర్మాత :  జి. హరి 

విడుదల తేదీ : 01 జూన్ 2018

తెలుగు, తమిళ భాషల్లో ఒక్కరోజున సినిమాలు విడుదల చేయడం విశాల్‌కి ఈ మధ్య సాధ్యం కావడం లేదు. దాంతో తమిళంలో ముందుగా విడుదలై ఏవరేజ్ టాక్, పూర్ రివ్యూలు వచ్చిన సినిమాలకు తెలుగులో ఆదరణ దక్కడం లేదు. అయితే... తెలుగులో 'అభిమన్యుడు'గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇరుంబు తిరై'కి తమిళంలో హిట్ టాక్‌తో పాటు సూపర్బ్ రివ్యూలు వచ్చాయి.  వీటికి తోడు సమంత హీరోయిన్‌గా నటించడం సినిమాకి ప్లస్ పాయింట్. అలాగే... సైబర్ వార్, హ్యాకింగ్ కాన్సెప్ట్ అనేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఎన్నో పాజిటివ్ పాయింట్స్ మధ్య వస్తున్న ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి. 

కథ 

మేజర్ కరుణాకరన్ (విశాల్)కి కోపం ఎక్కువ. ముఖ్యంగా అప్పు తీసుకున్న వాళ్ళ పట్ల ఇచ్చినవాళ్ళు ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే దేశశుద్ధి చేయకుండా వదలడు. కరుణాకరన్ చేతిలో తన్నులు తిన్నవాళ్ళు  కంప్ల‌యింట్స్‌ ఇవ్వడంతో గవర్నమెంట్ సైకియాట్రిస్ట్ దగ్గర యాంగర్  మేనేజ్‌మెంట్ స‌ర్టిఫికేట్‌ తీసుకురమ్మని ఆర్మీ అతణ్ణి ఆదేశిస్తుంది. డాక్టర్ లతాదేవి (సమంత) దగ్గరకు కరుణాకరన్ వెళతాడు. ట్రీట్మెంట్‌లో భాగంగా తెలిసిందేంటంటే... చిన్నతనంలో కరుణాకరన్ నాన్న ఊరంతా అప్పులు చేయడంతో అప్పు ఇచ్చినవారు ఇంటికి వచ్చి నానా మాటలు అనేవారు. దాంతో అతడికి తండ్రి మీద కోపం పెరుగుతుంది. తరవాత కుటుంబానికి దూరంగా ఉంటూ మేజర్ అవుతాడు. ప్రతినెలా ఇంటికి డబ్బులు పంపిస్తాడు గానీ... వాళ్ళ దగ్గరకు మాత్రం వెళ్ళడు. ప్రజల వెంటపడి అప్పులు ఇచ్చే బ్యాంకుల పట్ల, తీర్చనివాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించే రికవరీ ఏజెంట్స్ పట్ల కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇదంతా తెలుసుకొన్న లతాదేవి నెలరోజుల పాటు క‌రుణాక‌ర‌న్‌ని ఇంటికి వెళ్ళి, కుటుంబ సభ్యులతో సరదాగా ఉండి రమ్మని ఆదేశిస్తుంది. ఇంటికి వెళ్ళిన క‌రుణాక‌ర‌న్‌కి చెల్లెలు తనని ఎంత మిస్ అయ్యిందో? తెలుస్తుంది. ఆమె సంతోషం కోసం ఆమె కోరుకున్నవాడితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి కోసం ఇష్టం లేకున్నా బ్యాంకు నుంచి ఆరు లక్షల అప్పు తీసుకుంటాడు. అమ్మ పేరు మీదున్న ఆస్తి అమ్మెసి నాలుగు లక్షలు అదే బ్యాంకు ఖాతాలో వేస్తాడు. పెళ్లి పనులు ప్రారంభించే సమయానికి మొత్తం పది లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో మాయం అవుతాయి. దాన్ని వైట్ డెవిల్ (అర్జున్) కొట్టేస్తాడు. అతడు డబ్బు ఎలా కొట్టేశాడు? అతణ్ణి కరుణాకరన్ ఎలా పట్టుకున్నాడు? అనేది అసలు కథ.  

నటీనటుల పనితీరు :

మేజర్ పాత్రకి తగ్గట్టు విశాల్ ఫిజిక్ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. కానీ, సినిమాలో మేజర్‌గా కనిపించేది కాసేపే. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పట్నుంచి ఫిజిక్‌తో పని లేదు. అతనిలోని నటుడితోనే పని. అయితే... నటుడిగా విశాల్‌కి సవాల్ విసిరేంత సత్తా కరుణాకరన్ పాత్రలో లేదు. అతడు ఇంతకు ముందు ఇటువంటి ఎమోషన్స్ చాలాసార్లు చూపించినవే కావడంతో సులభంగా చేసేశాడు. సమంత పాత్రకు ఏమంత ప్రాధాన్యం లేదు. ఉన్నంత సేపు హుందాగా కనిపించింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో సూపర్బ్ విలనిజం పండించాడు. నటనలో మిగతావారు ఎవరికీ చెప్పుకోదగిన పాత్రలు లేవు. తమిళ నటీనటులు ఎక్కువ ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు వాళ్ళు రిజిస్టర్ కావడం కష్టమే.  

సంగీతం - సాంకేతిక వర్గం : 

యువన్ శంకర్ రాజా పాటల్లో ఒక్కటి కూడా గుర్తుపెట్టుకునేలా లేదు. అనువాద సాహిత్యం కూడా అంతంత మాత్రమే. రీ రికార్డింగ్ పర్వాలేదు.  సినిమా కాన్సెప్ట్‌కి తగ్గట్టు జార్జ్ సి. విలియమ్స్ డార్క్ సినిమాటోగ్రఫీ అందించారు. సినిమా తమిళ నిర్మాత విశాలే. అతడు ఎక్కడా ఖర్చుకి రాజీ పడలేదు. డబ్బింగులోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు.

దర్శకత్వం : 

దర్శకుడు పి.ఎస్. మిత్ర‌న్‌కి ఇదే తొలి సినిమా. మొదటి సినిమాకి మంచి కాన్సెప్ట్ రాసుకున్నాడు. రాతతో పాటు తీత కూడా బాగుంది. సినిమా మేకింగ్ మీద మంచి పట్టుందని చూస్తుంటే అర్థమవుతుంది. కానీ, కథను ఆసక్తిగా నడపడంలో కొంత తడబడ్డాడు. అయితే... సినిమా చూసే ప్రేక్షకుల్లో ఆలోచన కలిగించడంలో వందశాతం సక్సెస్ అయ్యాడు.

విశ్లేషణ :

సినిమాలో అర్జున్ 'ఇన్‌ఫ‌ర్మేష‌న్‌ ఈజ్ వెల్త్' అని ఓ డైలాగ్ చెబుతాడు. అంటే... 'సమాచారమే సంపద' అని. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక.. ప్రతి ఒక్కరూ ఏవో ఏవో యాప్స్ ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నారు. ఇన్‌స్టాల్‌ చేసుకొనే ముందు యాప్ పెట్టిన ప్రతి కండిషన్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దాంతో తమ ఫోనులో సమాచారాన్ని, తమ రహస్యాలను వేరొకరి చేతిలో పెడుతున్నారు. ఈ సమాచారంతో ఎవరైనా తలచుకుంటే ఏం చేయగలరనే అంశాన్ని దర్శకుడు సినిమాలో చూపించాడు. కథలో ఎన్నో విషయాలను చర్చించే వీలున్నా... బ్యాంకు లావాదేవీల్లో జరిగే మోసాల మీద దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడు. 

అయితే... అసలు కథ ప్రారంభించడానికి విశ్రాంతి వరకూ సమయాన్ని వృధా చేశాడు. అప్పటివరకూ సినిమాలో చూపించిన విశాల్, సమంత ప్రేమకథలో గానీ.. వినోదంలో గానీ... కుటుంబ అనుబంధాల్లో గానీ... పెద్దగా పస లేదు. సినిమాలో ప్రేక్షకులు లీనమయ్యి చూసేంత విషయం లేదు. విశ్రాంతి తరవాత సినిమాలో కాస్త వేగం వచ్చింది. తెరపై వచ్చే సీన్లు ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేస్తాయి. అయితే... అర్జున్ అంత డబ్బు ఎందుకు సంపాదించాలని అనుకుంటాడు? అనేది దర్శకుడు చూపించలేదు. 

థ్రిల్లర్ సిన్మా కావడంతో నటీనటులకు పెద్దగా నటించే స్కోప్ దొరకలేదు. ఫస్టాఫ్‌లో ఏదోలా బండి నడిపించిన దర్శకుడు, సెకాండఫ్‌లో వేగం పెంచడంతో పర్వాలేదని అనిపిస్తుంది. ప్రజల అమాయకత్వంతో పాటు అలసత్వాన్ని, డిజిటల్ ఇండియాలోని లోపాల్ని, లొసుగులను ప్రశ్నించే చిత్రమిది. ప్రజల్లో ఆలోచన పుట్టించే ప్రయత్నమిది.