రివ్యూ : విశ్వరూపం 2

రివ్యూ : విశ్వరూపం 2

నటీనటులు : కమల్ హాసన్, పూజా కుమార్, రాహుల్ బోస్, ఆండ్రియా, వహీదా రెహమాన్, శేఖర్ కపూర్ తదితరులు 

మ్యూజిక్ : మహ్మద్ గిబ్రాన్ 

ఫోటోగ్రఫి : శ్యాందత్, 

నిర్మాత : చంద్రహాసన్, కమల్ హాసన్ 

దర్శకత్వం : కమల్ హాసన్ 

రిలీజ్ డేట్ : 10-08-2018

కమల్ హాసన్ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.  సామాజిక అంశాల ప్రస్తావన ఆయన సినిమాల్లో కనిపిస్తుంది.  నటుడిగా కమల్ కు ఎలాంటి ఢోకాలేదు.  నటుడిగా ప్రూవ్ చేసుకున్న కమల్, రచయిత, దర్శకుడుగా మారి విశ్వరూపం సినిమా తీశాడు.  2013 లో వచ్చిన విశ్వరూపం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.  విశ్వరూపాన్ని ప్రీక్వెల్ గా విశ్వరూపం 2 ను తెరకెక్కించాడు.  ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.  

 

కథ : 

కమల్ హాసన్ ఇండియన్ రా ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంటాడు.  గూఢచారి అని ఎవరికీ అనుమానం రానివ్వకుండా ఆల్ ఖైదా తీవ్రవాదులతో చేతులు కలిపి వాళ్ళ వ్యూహాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని, భారత సైన్యానికి తెలిజేస్తుంటాడు.  కమల్ హాసన్ ఇండియన్ గూఢచారి అనే విషయాన్ని ఆల్ ఖైదా ఉగ్రవాది రాహుల్ బోస్ కనిపెడతాడు.  కమల్ ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, కమల్ తో కలిసి ఇండియాలో 64 చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు రచిస్తాడు.  రాహుల్ బోస్ పన్నిన కుట్రను కమల్ ఎలా భగ్నం చేశాడు...? బాంబు దాడులు జరగకుండా ఇండియాను ఎలా కాపాడాడు అన్నది కథ.  

విశ్లేషణ : 

మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ తో సినిమాను ఓపెన్ చేశాడు.  కమల్ హాసన్ గూఢచారిగా ఎందుకు మారాలని అనుకున్నాడు.. అక్కడి నుంచి ఆల్ ఖైదా తీవ్రవాద స్థావరాల్లోకి ఎలా వెళ్ళాడు.. వెళ్లే సమయంలో కమల్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే విషయాలను తెరపై అద్భుతంగా చూపించాడు.  హాలీవుడ్ స్థాయిలో స్టంట్ సీన్స్ ఉన్నాయి.  యూకేలో కమల్ పై ఎటాక్ జరిగే సీన్ చిత్రీకరణ సినిమాకు హైలైట్ గా ఉంది.  ఆ తరువాత వచ్చే యాక్షన్స్ సీన్స్ తో కథ ఒక్కసారిగా మారిపోతుంది.  ఈ యాక్షన్ సీన్స్ అన్ని ఉత్కంఠతను కలిగించాయి.  సినిమా అంతా ఇలానే ఉంటె బాగుంటుంది అనుకునేలోపే.. ఒక్కసారిగా టపీమని కిందపడేస్తాడు.  మళ్ళీ రొటీన్ గా మారిపోయింది.  కమల్ హాసన్ కు, అధికారులకు మధ్య వచ్చే సీన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి.  ఈ సీన్స్ ఎంత త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది.  చెప్పడానికి ఇంకేమి లేకపోవడంతోనే.. ఈ సీన్ ను ఇరికించి ఇబ్బంది పెట్టారు.  కమల్ హాసన్ వంటి అనుభవం ఉన్న నటుడు కూడా ఇలా బోర్ కొట్టే విధంగా సీన్స్ ను తయారు చేసుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి..?  ఇక్కడి నుంచి బయటపడ్డాక వచ్చే యూకే యాక్షన్ సీన్స్ బాగుంది.  అక్కడి నుంచి కథను తిరిగికి ఢిల్లీకి తీసుకొచ్చాడు.  ఫస్ట్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ను చూపించిన కమల్ సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సెంటిమెంట్ ప్లే చేశాడు.  సెంటిమెంట్ సన్నివేశాల్లో కమల్ ఎలా చేస్తాడో చెప్పక్కర్లేదు.  ఢిల్లీలో  ఉగ్రవాదుల గ్యాంగ్ కు, కమల్ కు మధ్య జరిగే పోరాట దృశ్యాలు ఆకట్టుకున్నాయి. అరె బాగున్నాయి అనుకుంటుండగానే మరలా సినిమా ఫ్లాట్ గా మారిపోయింది.  తీవ్రవాది రాహుల్ బోస్ కమల్ తల్లిని, అతనికి కాబోయే భార్య పూజా కుమార్ ను కిడ్నాప్ చేస్తాడు.  ఈ ఏడిపిసోడ్ కొంత నాటకీయంగా నడిపించినట్టుగా ఉన్నది.  క్లైమాక్స్ సన్నివేశాలు కూడా కావాలని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉన్నాయి.  కమల్ హాసన్ వంటి నటుడు దర్శకుడిగా మరి సినిమా చేస్తే షడ్రుచుల సమ్మేళంగా ఉంటుంది అనుకుంటే.. ఉప్పూకారం లేని చప్పిడి అన్నంలా ఉండటమే మింగుడుపడని విషయం.  

నటీనటుల పనితీరు : 

ఫస్ట్ హాఫ్ లో కమల్ నటన ఆకట్టుకుంది.  ఫైట్ సీన్స్ లో కమల్ అద్భుతంగా నటించాడు.  పూజా కుమార్, ఆండ్రియాల పెరఫార్మన్స్ తో సినిమాకు గ్లామర్ తెచ్చారు.  ఆర్మీ అధికారిగా శేఖర్ కపూర్, తీవ్రవాదిగా రాహుల్ బోస్ ల నటన బాగుంది.  సాంకేతికంగా సినిమా బాగుంది.  ఫస్ట్ హాఫ్ లో ఉన్న బిగుతు.. సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నట్టయితే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.  

సాంకేతికం : 

యాక్షన్ ఏడిపిసోడ్స్ లో ఇచ్చిన జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగుంది.  శ్యాందత్ ఫొటోగ్రఫీ హాలీవుడ్ చిత్రాలను తలపించే విధంగా ఉంది.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటుడుగా కమల్ హాసన్ వంద మార్కులు కొట్టేస్తే.. దర్శకుడిగా 35 మార్కులు కూడా తెచ్చుకోలేకపోయాడు.  

పాజిటివ్ పాయింట్స్ : 

యాక్షన్ ఎపిడిసోడ్స్ 

నటీనటులు 

నేపధ్యం 

నెగెటివ్ పాయింట్స్ : 

కథ 

సెకండ్ హాఫ్ 

చివరిగా : టైటిల్ లో ఉన్న విశ్వరూపం సినిమాలో కనిపించలేదు.