కేన్సర్, గుండెజబ్బులకు "విటమిన్ డి" పనిచేయదు

కేన్సర్, గుండెజబ్బులకు "విటమిన్ డి" పనిచేయదు

విటమిన్ డి కోసం ప్రత్యామ్నాయంగా వాడే పిల్స్ తో ఉపయోగం లేదని... ఆ పేరుతో విలువైన ధనాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోరాదని నిపుణులు హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా భారతీయుల విషయంలో విటమిన్ డి లోపంపై అసలు అధ్యయనాలే జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో జరిగిన శ్యాంపిల్ స్టడీస్ నే ఇండియాలోని పేషెంట్లకు కూడా అన్వయింపజేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని వారంటున్నారు. విటమిన్ డి సూర్యకాంతిలో సహజంగా లభిస్తుంది. అయితే అర్బన్ ఏరియాల్లో సూర్యకాంతికి దూరంగా ఉండేవారు కృత్రిమంగా పిల్స్ లేదా చేపనూనె (ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కోసం) ను వాడుతారు. అయితే విటమిన్ డి లోపించిందన్న పేరుతో గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు నిరోధించుకునేందుకు వాడే పిల్స్ తో ఎలాంటి ఉపయోగం లేదని ఆనందరాజా అనే కార్డియాలజిస్ట్ కరాఖండిగా చెబుతున్నారు.  ఈయన ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 18 ఏళ్ల పాటు పని చేశారు. ఆ తరువాత ఇప్పుడు పాండిచ్చేరిలో సొంత క్లినిక్ నిర్వహిస్తున్నారు. 

చాలా మంది హర్ట్ పేషెంట్స్ కు విటమిన్ డి లోపం ఉందని, అయితే ఆ లోపంతోనే గుండెజబ్బులు వస్తున్నాయని మాత్రం ఆయన చెప్పడం లేదు. దీనిమీద ఐదేళ్లుగా సుదీర్ఘమైన ఓ అధ్యయనం జరుగుతోంది. ఆ వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే హెల్త్ మేగజైన్లో అచ్చయ్యాయి. విటమిన్ డి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎలా పనిచేస్తాయనే విషయంలో దాదాపు 26 వేల మంది మీద అధ్యయనం చేశారు. అందులో తేలిందేమంటే.. విటమిన్ డి పిల్స్.. కేవలం మానసిక సంతృప్తినిచ్చేవే (ప్లాసిబో) తప్ప అది కేన్సర్, గుండెజబ్బుల విషయంలో వర్క్ చేస్తుందని నిర్ధారణ కాలేదు. చేపనూనెలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విషయంలో కూడా ఇదే తేలింది. అయినప్పటికీ విటమిన్ డి సప్లిమెంట్స్ ను డాక్టర్లందరూ పెద్దఎత్తున ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఈ వ్యాపారం 2020 నాటికి 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని హెల్త్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2014 తో పోలిస్తే ఇది ఆనాటికి 11 శాతం పెరుగుతుందంటున్నారు. అంటే నిర్ధారణ కాని అంశం మీద ఎన్ని కోట్ల రూపాయలు మనం తగలేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యయనాలు, చైనాలో జరిగిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుండడం విశేషం. 

అయితే దీన్ని భారత్ కు ఎలా అన్వయించుకోవాలనే విషయంలో భారత వైద్యులకు అసలు అవగాహనే లేదు. అసలు టెస్ట్ రిజల్ట్స్ ని ఎలా నిర్ధారించుకోవాలి, ఆ రిపోర్టును ఎలా నిర్వచించుకోవాలో మనవాళ్లకు అవగాహన లేదంటున్నారు. ఇండియాలో రెండేళ్ల క్రితం క్లినికల్ బేస్డ్ స్టడీ ఒకటి జరిగింది. 26 వేల పైగా పేషెంట్ల హెల్త్ రిపోర్టులు చెక్ చేస్తే.. వారిలో 93 శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గుర్తించారు. ఆ ఒక్క లోపం మినహా వారి ఆరోగ్యంలో మరెలాంటి సమస్యలూ కనిపించలేదు. అంటే ఇండియాలో విటమిన్ డి లోపం, ఇతర సీరియస్ జబ్బుల మధ్య ఉన్న సంబంధంపై అసలు అధ్యయనాలు జరగలేదు. అయితే ఇలాంటి అధ్యయనాలు మన పక్కనే ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ లలో జరగడం విశేషం. 

ఇక మనవాళ్లు మాత్రం పాశ్చాత్య దేశాల్లోని డాటా తెప్పించుకునే మన పేషెంట్స్ ను ట్రీట్ చేస్తున్నారు తప్ప.. ఇక్కడి గాలి, వెలుతురు, వెలుతురులో మనవాళ్లు ఉండే సమయం, ఆహార అలవాట్లు.. వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పాశ్చాత్య రిపోర్టుల మీదనే ఆధారపడి ప్రిస్క్రిప్షన్ రాయడం, ట్రీట్ మెంట్ ఇవ్వడం చేస్తున్నారు. 

ఫైనల్ గా మనవాళ్లు చెబుతున్నదేంటంటే.. అన్ని విటమిన్లతో మానవ శరీరానికి లాభం ఉన్నట్టే విటమిన్ డి తో కూడా ఉంది. దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కానీ.. ప్రత్యేకంగా గుండెజబ్బుల విషయంలో దానికి సంబంధం ఉందన్నది రుజువు కాలేదు. అయితే ఇండియన్ విటమిన్ డి లెవల్ డాటా ప్రకారం.. మనవాళ్లంతా విటమిన్ డి లోపంతోనే ఉన్నారు. ఔట్ డోర్లలో పని చేసేవారికి కూడా ఇది వర్తిస్తుంది. దీన్నిబట్టి డార్కర్ స్కిన్ ఉన్నవాళ్లు (ఇండియన్స్) సూర్యరశ్మిలో ఉన్నా విటమిన్ డి ని అందుకోలేకపోతున్నారని, పాశ్చాత్య దేశాల్లోని ఫెయిర్ కలర్ ప్రజల కన్నా నలుపు చాయలో ఉండే ఇండియన్స్ కి విటమిన్ డి అవసరం అంతగా లేదన్న అంచనాకు వచ్చేశారు. 

ఇక నొప్పులు, అలసట వంటి సమస్యలకు విటమిన్ డి తో సంబంధం లేదని, అందుకు ఎముకల సాంద్రత తక్కువగా ఉండడమే కారణమై ఉంటుంది అంచనా వేస్తున్నారు. కాబట్టి విటమిన్ డి పిల్స్ ను వాడాల్సిన అవసరం లేదని వారు ఘంటాపథంగా సూచిస్తున్నారు.