260 ఏళ్ల చరిత్ర కలిగిన సిరిమాను ఉత్సవాలు ఎందుకు చేస్తారో తెలుసా ?

260 ఏళ్ల చరిత్ర కలిగిన సిరిమాను ఉత్సవాలు ఎందుకు చేస్తారో తెలుసా ?

ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద జాతర విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు. లక్షల మంది భక్తులు అమ్మవారి సిరిమానోత్సవాల్లో పాల్గొంటారు. సిరిమానోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన తోలేలోత్సవం, సిరామానోత్సవం తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్‌..తెలంగాణతో పాటు చత్తీస్‌గఢ్‌..ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు జిల్లాకు వస్తుంటారు. జిల్లాలో రెండు రోజులు పాటు పండుగని తిలికించి వెళ్తుంటారు. సిరిమానోత్సవాల సందర్బంగా ఘటాల ఉరేగింపు, పులి వేషాలు అమ్మవారి పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఐతే కరోనా కారణంగా ఈ సంవత్సరం సిరిమాను ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. 

విజయనగరం సంస్ధానానికి చెందిన ఆడపడుచు అయిన పైడిమాంబే ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారిగా పూజలు అందుకొంటోంది. 258 ఏళ్ల క్రితం విజయనగర సంస్థానంలో ఆడపడుచుగా జన్మించింది పైడిమాంబ. విజయనగరం సంస్దానానికి అప్పటి రాజు అయిన అన్న పెద విజయరామరాజు చెల్లెలే.. పైడిమాంబగా చెబుతుంటారు పెద్దలు. పైడిమాంబకు అన్నపెద విజయరామరాజు అంటే ఎంతో ప్రేమ. ఈ పైడిమాంబ చిన్నతనం నుంచి దుర్గా దేవీ భక్తురాలు. బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు యుద్ధం చేయడానికి వెళ్తాడు. విదేశీయుడైన బుస్సీ పన్నిన కుట్రను ముందుగా ఈమె తన అన్న పెద విజయరామరాజుకు తెలిసేలా చేస్తుంది. 

తన అన్న యుద్దం చేయడం ఇష్టం లేని పైడిమాంబ.. అతడిని వెళ్లనీయకుండా అడ్డుపడుతుంది. నువ్వు చేస్తున్న ఈ యుద్ధం ప్రజలకు క్షేమం కాదు. యుద్దం చెయ్యవద్దు. చేస్తే మరణిస్తావు అని అన్నను బతిమిలాడుతోంది. చిన్నతనంలో పైడిమాంబ చెప్పిన మాటలను పెడచెవిన పెట్టాడు విజయరామరాజు. ఆ తరువాత జరిగిన బొబ్బిలి యుద్దంలో తాండ్రపాపారాయుడి చేతిలో హత్యకు గురయ్యాడు విజయరామరాజు. ఇక బొబ్బిలి యుద్దంలో ఉన్న తన అన్న యోగక్షేమాలు తెలుసుకునేందుకు పైడిమాంబ బయలుదేరుతుంది. తమ సంస్ధానంలో పనిచేసే, పైడిమాంబ యోగక్షేమాలు చూసే, పతివాడ అప్పలనాయుడు అనే సన్నిహితుడిని వెంటబెట్టుకొని వెళ్తుంది. స్వయంగా గుర్రపు బగ్గీపై కోట నుండి పైడిమాంబ బయలుదేరుతుంది. 

ప్రస్తుతమున్న రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకునేసరికి సోదరుడు విజయరామరాజు మరణవార్త పైడిమాంబకు తెలుస్తుంది. అది విన్న పైడిమాంబ అక్కడే స్పృహ కోల్పోతుంది. పైడితల్లితో ఉన్న అప్పలనాయుడు సపర్యలు చెయ్యగా చిన్నారి పైడిమాంబకు మెలకువ వస్తుంది. ఆతరువాత పైడిమాంబ తాను ఇక బతకనని, దేవీలో ఐక్యం అవుతున్నానని చెప్పి మరణిస్తుంది. ఐతే తన విగ్రహం మహారాజ కోటకు ఎదురుగా ఉండే పెద్దచెరువులో పశ్చిమ దిక్కున లభ్యమవుతుందని అప్పలనాయుడుకు కలలో కనిపించి చెబుతుంది. చిరు ప్రాయం నుంచే దేవీభక్తురాలైన పైడిమాంబ తరువాత ఆ దేవీలోనే ఐక్యమైందని పూర్వీకుల కథనం. 

తదుపరి గజపతుల ఆత్మీయుడైన అప్పలనాయుడు కలలో కనిపించి తాను దేవతగా అవతరించానని, తన ప్రతిమ పెద్ద చెరువులో వెలసి ఉందని, ఆ విగ్రహాన్ని బయుటకు తీసి ప్రతిష్టించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమయినట్టుగా పురాణ కథనం. స్వప్నంలో అమ్మవారి చెప్పినట్టుగా పతివాడ అప్పలనాయుడు గ్రామస్థులతో కలిసి పెద్ద చెరువులో వెతుకుతారు. వారికి అమ్మవిగ్రహం కనబడదు. జాలరి వాళ్ల వలలో విగ్రహం చిక్కుకుంటుంది. ఆవిగ్రహాన్ని బయటకు తీసి ఆ పెద్ద చెరువు ఒడ్డునే ఆలయం నిర్మించి ప్రతిష్టించి పూజలు చేశారు గ్రామస్ధులు. దీనిని నేడు వనం గుడిగా చెబుతూ నిత్యం పూజలు చేస్తున్నారు భక్తులు. ఇలా పైడిమాంబ పైడితల్లిగా అవతరించారు. 1758వ సంవత్సరం అంటే దాదాపు 260 సంవత్సరాల చరిత్ర కలిగిన కోవెల...అంతటి చరిత్ర కలిగిన సిరిమాను ఉత్సవాలు ఈ పైడిమాంబ సొంతం.