ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు

ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు

కేబినెట్‌లో చోటు దక్కలేదు. మొన్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంలో అయినా లాటరీ తగులుతుంది ఆశిస్తే అదీ లేదు. డీలా పడ్డ ఆ జిల్లా నేతలకు ఇప్పుడు కేబినెట్‌ ర్యాంక్‌ కలిగిన మరో పదవిపై ఆశలు చిగురించాయి. ఎవరికి వారుగా ఆ సీట్‌పై కర్చీఫ్‌ వేసే పనిలో పడ్డారట. 

ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌ పదవిపై ఆశలు!

ఏపీలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర సర్కార్‌ అడుగులు వేస్తోంది. ఈ వార్తే ఉత్తరాంధ్ర నేతల్లో సంతోషం తీసుకొచ్చింది. అధికార పార్టీ నేతల్లో రేస్‌ కూడా మొదలైంది. విజయనగరం కేంద్రంగా ఏర్పాటయ్యే ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌ పదవిపై జిల్లాలోని సీనియర్ వైసీపీ నాయకులు కోటి ఆశలు పెట్టుకున్నారు. 

కేబినెట్‌లో చోటు దక్కని వాళ్లు ఆశలు!

2014 కంటే 2019లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వైసీపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. శాసనసభ్యుల్లో చాలా మంది కేబినెట్‌ బెర్త్‌ ఆశించారు. కానీ.. కొందరినే ఆ అదృష్టం వరించింది.  ఈ విధంగా మంత్రిమండలిలో చోటు దక్కని నాయకులు ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌ పదవిపై కన్నేశారట.

విజయనగరం జిల్లా వారికే చైర్మన్‌ పదవి?

చైర్మన్‌తోపాటు అభివృద్ధి మండలిలో ఏడుగురు సభ్యులు ఉంటారని.. చైర్మన్‌కు కేబినెట్‌ ర్యాంక్‌ హోదా కల్పిస్తారని తెలుస్తోంది. అంటే మంత్రి పదవితో సమానమైన గౌరవం, హోదా లభిస్తుంది. అందుకే ఈ సీటుపై కర్చీఫ్ వేసేందుకు  ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అప్పలరాజుకు మంత్రి పదవి ఇవ్వడం, ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించడం, స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఉండటంతో.. ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి చైర్మన్ పదవి విజయనగరం జిల్లా వారినే వరిస్తుందని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. 

కోలగట్లకే చైర్మన్‌ పదవి అని అనుచరుల ప్రచారం!

ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చైర్మన్‌ రేస్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు వీరభద్రస్వామి. అందుకే మంత్రి పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. సామాజిక సమీకరణాలతో కేబినెట్‌లో చోటు దక్కలేదు. అప్పటి నుంచి నిరాశలో ఉన్నా.. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి చైర్మన్ కోలగట్లేనని ప్రచారం మొదలుపెట్టేశారు అనుచరులు. 

బొత్స మేనల్లుడు చిన్నశ్రీను పేరును పరిశీలిస్తారా?

వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పేరు కూడా చైర్మన్‌ రేస్‌లో వినిపిస్తోంది. సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నా... ఆయన్ని కాదని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణికి మంత్రి పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం చేశారు. దీంతో రాజన్నదొర శిబిరంలో నిరాశ ఆవహించింది. వీరిద్దరితోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్నశ్రీను పేరుకూడా  బలంగానే వినిపిస్తోందని పార్టీ వర్గాల టాక్‌. పాదయాత్రలో జగన్‌కు వెన్నంటి ఉంటూ ఆయనకు చేరువయ్యారు. అందుకే చిన్నశ్రీను పేరును తేలిగ్గా తీసుకోవడానికి లేదని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పాటవుతుందో కానీ.. విజయనగరం జిల్లాలో మాత్రం ఆశావహుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆ ఈక్వేషన్లు..ఈ ఈక్వేషన్లు అంటూ ప్రచారం ఊదరగొడుతున్నారు. మరి.. సీఎం జగన్‌ ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి.