భారత సైన్యాన్ని 'మోడీ సేన' అనేవాళ్లు దేశద్రోహులు

భారత సైన్యాన్ని 'మోడీ సేన' అనేవాళ్లు దేశద్రోహులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ర్యాలీలో భారత సైన్యాన్ని 'మోడీ సైన్యం' అన్నారు. భారత ఎన్నికల సంఘం సీఎం యోగిని ఏప్రిల్ 5లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా కోరింది. యోగి కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ పార్లమెంట్ స్థానం గాజియాబాద్ లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

'కాంగ్రెస్ వాళ్లు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తారు. మోడీ సేన వాళ్లని తూటాలతో నేలకూల్చేస్తుంది. ఇదే తేడా. కాంగ్రెస్ వాళ్లు మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులను జీ అని సంబోధిస్తారు. కానీ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసి వాళ్ల వెన్ను విరుస్తుందని' యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సీఎం యోగి ఎవరికైతే ప్రచారం చేస్తున్నారో, ఆయనే ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ అలా అనడం దేశద్రోహం అని చెప్పారు.

బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జనరల్ వీకే సింగ్ భారత సైన్యాలు భారత్ కే చెందుతాయని, అవి ఏ రాజకీయ పార్టీకి చెందవని స్పష్టం చేశారు. ఎవరైనా భారత సైన్యం మోడీ సేన అని అంటే అది తప్పు మాత్రమే కాదు, వాళ్లు దేశద్రోహులేనని అన్నారు. ఎవరు అలాంటి మాటలంటారో అర్థం కావడం లేదని, ఎవరి దగ్గర చెప్పేందుకు వేరే ఏం ఉండదో వాళ్ల మనసుల్లోకే ఇలాంటి ఆలోచనలు వస్తాయని జనరల్ వీకే సింగ్ చెప్పారు.

ఇంతకు ముందు ఎన్నికల సంఘం యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'మోడీ సేన' వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాల్సిందిగా గాజియాబాద్ డీఎంను ఆదేశించింది. మీడియా కథనాల ఆధారంగా యోగి వ్యాఖ్యలపై రిపోర్ట్ కోరింది.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు సాయుధ బలగాలకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం సూచనలను యోగి ఉల్లంఘించారని కమిషన్ వర్గాలు అంటున్నాయి. శుక్రవారం సాయంత్రంలోగా జవాబు ఇవ్వాలని ఆదిత్యనాథ్ కు ఈసీ సూచించింది.