మొబైల్ యూజర్లకి కాల్ 'వాతలు'...సర్వం సిద్దం !

మొబైల్ యూజర్లకి కాల్ 'వాతలు'...సర్వం సిద్దం !

సర్వీసు సంగతి ఏమో కానీ...మొబైల్ కంపెనీలు ఛార్జీలు పెంచటంలో మాత్రం ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. ఒకే రోజులో కొన్ని గంటల వ్యవధిలోనే మూడు కంపెనీలు వినియోగదారులపై పెద్ద భారం మోపాయి. జియో...వొడాఫోన్...ఐడియా ఛార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం వినియోగాదారలకు మరింత భారం కానుంది. వాయిస్‌, డేటా ఛార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్లు  జియో  ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు  తీసుకొస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో నూతన ప్లాన్ల కింద 300 శాతం అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది.  కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లలో ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు గానూ ఎఫ్‌యూపీ లిమిట్‌ విధించనున్నట్లు వెల్లడించింది.

సవరించిన టెలికాం ఛార్జీల విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని వివరించింది. వొడాఫోన్‌  ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌  డిసెంబర్‌ 3 నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే జియో కూడా పెంపు నిర్ణయం తీసుకోవడం విశేషం. వొడాఫోన్‌, ఐడియాలు కూడా డిసెంబర్‌ 3 నుంచి ఛార్జీలను  పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈ ఛార్జీల పెంపుదల 42 శాతం వరకు ఉండనుంది. దీనికి తోడు వొడాఫోన్‌ ఐడియా నుంచి ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌పై కూడా నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఓ మొబైల్‌ కంపెనీ టారిఫ్‌ ధరలను పెంచడం విశేషం.