వోడాఫోన్ ఐడియాకి క్యూ3లో రూ.5,005 కోట్ల నష్టం

వోడాఫోన్ ఐడియాకి క్యూ3లో రూ.5,005 కోట్ల నష్టం

డిసెంబర్ 2018తో ముగిసిన త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియాకు రూ.5,004.60 కోట్ల నష్టం వచ్చింది. సెప్టెంబర్ 2018తో ముగిసిన గత త్రైమాసికంలో కంపెనీకి రూ.4,973.8 కోట్ల నష్టం వాటిల్లింది. కంపెనీ విడుదల చేసిన ఫలితాల ప్రకారం విలీనం తర్వాత ఏర్పడిన కొత్త కంపెనీకి డిసెంబర్ త్రైమాసిక కాలంలో పన్ను ఖర్చులు పెరిగి రూ.1,999.7 కోట్లకు చేరాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది కేవలం రూ.45.40 కోట్లుగా ఉంది. 

మొత్తం ఆదాయం రూ.11,983 కోట్లు
స్టాక్ ఎక్స్చేంజీలో కంపెనీ ఇచ్చిన ఫైలింగ్ ప్రకారం త్రైమాసిక కాలంలో మొత్తం ఆదాయం రూ.11,983 కోట్లుగా ఉంది. విలీనం తర్వాత ఏర్పడిన కొత్త కంపెనీ వొడాఫోన్ ఐడియా బోర్డు రూ.25,000 కోట్ల రైట్ ఇష్యూకి ఆమోదం ఇచ్చేసింది.

ఆర్పూ పెరిగింది, కానీ రుణభారం కుంగదీసింది 
2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో కంపెనీ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పూ) పెరిగి రూ.89కి చేరింది. ఇది రెండో త్రైమాసికంలో రూ.88గా ఉంది. ఈ త్రైమాసిక కాలంలో కంపెనీపై మొత్తం రూ.1,23,660 కోట్ల రుణభారం పడింది. ఇందులో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ.91,480 కోట్ల డిఫర్డ్ స్పెక్ట్రమ్ పేమెంట్ ఆబ్లిగేషన్ ఉంది. రూ.8,900 కోట్ల నగదు, క్యాష్ ఈక్వివాలెంట్స్ కింద కంపెనీ నికర అప్పులు రూ.1,14,760 కోట్ల స్థాయికి చేరాయి. సెప్టెంబర్ 2018తో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ.1,12,510 కోట్ల దగ్గర ఉంది.