ఏపీలో ఆసక్తికర పరిణామం.. టీడీపీ గెలిచిన ఊర్లలో వాలంటీర్ల సస్పెన్షన్ ?

ఏపీలో ఆసక్తికర పరిణామం.. టీడీపీ గెలిచిన ఊర్లలో వాలంటీర్ల సస్పెన్షన్ ?

ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన గ్రామాల్లో వాలంటీర్లు తొలగింపు వివాదాస్పదంగా మారింది. అద్దంకి మండలంలో టీడీపీ మద్దతు దారులు సర్పంచ్ లుగా గెలుపొందిన రెండు గ్రామాల్లో పది మంది వాలంటీర్లను అధికారులు తొలగించారు. రెండో విడతలో అద్దంకి నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అద్దంకి మండలంలోని  ధేనువకొండ, మోదేపల్లి గ్రామాల్లో టీడీపీ మద్దతు దారులు పంచాయతీ సర్పంచ్ లుగా గెలుపొందారు. దీంతో రెండు గ్రామాల్లో వాలంటీర్లు సరిగా పని చేయలేదని అధికార పార్టీ నేతలు ఆగ్రహించారు.

ధేనువకొండ గ్రామంలో ఏడుగురు, మోదేపల్లి గ్రామంలో ముగ్గురు వాలంటీర్లను తొలగిస్తూ అద్దంకి ఎంపిడిఓ రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీతో ఉత్తర్వులు జారీ కాగా వాటిని ఆయా వాలంటీర్లకు మంగళవారం అందజేశారు. మరో వైపు అద్దంకి నియోజక వర్గంలోని మరికొన్ని పంచాయతీల్లో కూడా వాలంటీర్లను తొలిగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  అయితే గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయకపోవడంతోనే వాలంటీర్లు తొలగించినట్లు అద్దంకి ఎంపిడిఓ చెబుతున్నారు.

ఇక ధేనువకొండ గ్రామంలో వాలంటీర్ల తొలగింపుపై బాధిత వాలంటీర్లతో కలిసి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ధేనువకొండ గ్రామ సచివాలయం ఎదుట భైఠాయించి తమ నిరసన తెలిపారు. విధుల్లో నుండి తొలగించిన వాలంటీర్లను తిరిగి తీసుకోవాలని నినాదాలు చేశారు. వాలంటీర్లు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా రాజకీయ ఒత్తిడిలతో తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలిన డిమాండ్ చేశారు. మరో వైపు గ్రామంలో తమ పని తీరు గురించి తెలుసుకున్న తరువాత తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు.