ఘాటు పదాలతో క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ!

ఘాటు పదాలతో క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ!

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక, ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కథనాలు వచ్చాయి. దీనిపై ఘాటుగా స్పందించారు లక్ష్మీనారాయణ.. ఈ వార్తలు తనను షాక్‌, ఆశ్చర్యానికి గురిచేశాయని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఆయన.. ఒక సామెత ఉంది.. "గిట్టనివాళ్లు పుకార్లు సృష్టిస్తారు.. వాటిని ఫూల్స్ వ్యాపింపజేస్తారు.. ఇడియట్స్ చేత అంగీకరించబడతాయి" మీరు ఏ కోవకు చెందినవారు నిర్ణయించుకోవాలంటూ ఘాటైన పదాలతో ట్వీట్ చేశారు.

ఇక తన అవసరం పార్టీకి ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భావించే వరకూ తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు లక్ష్మీనారాయణ. "ఇలాంటి వార్తలతో సమయాన్ని వృథా చేసుకోవద్దని.. ఆ సమయాన్ని వరద బాధితులకు సాయం చేయడానికో.. మొక్కలు నాటేందుకో.. ప్లాస్టిక్‌ను తొలగించేందుకో.. లేకపోతే యువతకు ప్రేరణగా నిలిచేందుకో వాడుకోవాలి.. జై హింద్" అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా, తాను వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో పర్యటించిన సీబీఐ మాజీ జేడీ.. వివిధ సమస్యలపై అధ్యయనం చేశారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన ఆయన.. విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరపున బరిలోకిదిగి ఓటమిపాలయ్యారు. మొత్తానికి తనపై పుకార్లు పుట్టించేవారికి సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కౌంటర్ ఇచ్చారు లక్ష్మీనారాయణ.