ధోనీపై వీవీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ధోనీపై వీవీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 జరుగుతోన్న సమయంలో మిస్టర్ కూల్, బెస్ట్ ఫినిషర్ ఎంఎస్ ధోనీ ఆటతీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. తాజాగా టీమిండియా-వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ప్రదర్శనపై కూడీ విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టినా.. ధోనీ 56 పరుగులు చేసి నానౌట్‌గా నిలిచినా విమర్శలు తప్పలేదు. మ్యాచ్‌ అనంతరం ధోనీ ఆటపై స్పందించిన టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్... 'ఈ మ్యాచ్‌లో ధోనీ చివరిదాకా క్రీజులో నిలిచి 56 (నాటౌట్‌)హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా మొదట్లో ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడని అభిప్రాయపడ్డారు లక్ష్మణ్. "ధోనీ ఎప్పటిలాగే ఫినిషింగ్‌లో బ్యాట్‌ ఝళిపించి ఆకట్టుకున్నాడు. అది జట్టుకు బాగా కలిసొచ్చే అంశమే. కానీ, అయితే ఆరంభం కూడా అదే రీతిలో సాగి ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ అందుకు విరుద్ధంగా ధోనీ నిదానంగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడని.. స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ అతను ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడని.. స్ట్రైక్‌ రేట్‌ కూడా 50కి మించకపోవడం అసంతృప్తికి గురి చేసిందని పేర్కొన్నారు. ఇక ‘ఏదో ఒక రోజు ఈ విషయంలో ధోనీకి కూడా అలాంటి భావనే కలగవచ్చు.. ఇన్నింగ్‌ నిదానంగా ఆరంభిస్తున్నట్లు తాను కూడా చింతిస్తాడు అని హాట్ కామెంట్లు చేసిన లక్ష్మణ్... అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను ఇబ్బంది పడ్డాడని గుర్తు చేశారు. మరోవైపు మిస్టర్ కూల్ బ్యాటింగ్‌లో దూకుడు తగ్గడంపై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ జోకులు పేల్చుతున్నారు.