తెలంగాణకు అరుదైన గౌరవం

తెలంగాణకు అరుదైన గౌరవం

‘ఇండియా సైకిల్4చేంజ్ ఛాలెంజ్’ లో తెలంగాణకు  అరుదైన గౌరవం దక్కింది. సైక్లింగ్ ఫ్రెండ్లీ సిటీ కింద 95 నగరాలు  రిజిస్టర్  అయ్యి  ‘ఇండియా సైకిల్4చేంజ్ ఛాలెంజ్’ లో భాగస్వామ్యం అయ్యాయి.  తొలి దశ (స్టేజ్​–1)లో షార్ట్​ లిస్టు చేసి  25 సిటీలను కేంద్ర హౌసింగ్​ అండ్​ అర్బన్​ ఎఫైర్స్​ మంత్రిత్వ శాఖ  ఎంపిక చేసింది. వాటిలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ తో పాటు వరంగల్​ సిటీ ఎంపికయ్యాయి. ఆరోగ్యం, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా పౌరులు సైకిల్ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే  ‘ఇండియా సైకిల్4చేంజ్ ఛాలెంజ్’ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ లో భాగంగా ‘ఇండియా సైకిల్4చేంజ్ ఛాలెంజ్’ ను  పూర్తిస్థాయిలో సమర్ధవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర మున్సిపల్​ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ  మంత్రి శ్రీ కె.టి.రామారావు ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​ మున్సిపల్​ కార్పొరేషన్లకు మార్గనిర్దేశనం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసి) పరిధిలో   ‘ఇండియా సైకిల్4చేంజ్ ఛాలెంజెస్’ కార్యక్రమాన్ని అమలులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్​ పోర్ట్​ అథారిటీ(హుమ్టా) లు టెక్నికల్ అడ్వయిజ్, గైడెన్స్ అందిస్తున్నాయి. పోలీసు శాఖ సహకారంతో ఇప్పటికే కెబిఆర్​ పార్కు, నెక్సెస్​ రోడ్డు మార్గంలో పౌరుల సౌకర్యార్ధం సైకిల్​ ట్రాక్​ లు ఏర్పాటు అయ్యాయి.