ఐపీఎల్: కోల్‌కతా లక్ష్యం 182

ఐపీఎల్: కోల్‌కతా లక్ష్యం 182

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి.. కోల్‌కతా ముందు 182 పరుగుల భారీ లక్ష్యంను ఉంచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్‌స్టోలు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలుత నెమ్మదిగా ఆడిన ఈ జంట అనంతరం పుంజుకుని వేగం పెంచారు. ముఖ్యంగా వార్నర్ బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్‌లో 37వ అర్థశతకం సాధించాడు.

మరోవైపు బెయిర్‌స్టో కూడా వార్నర్‌కి మంచి సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కి 118 పరుగులు జోడించారు. అయితే పియూష్ చావ్లా వేసిన 13వ ఓవర్ ఐదవ బంతికి బెయిర్‌స్టో (39) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం రస్సెల్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి వార్నర్ (85) ఊతప్పకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హిట్టర్ యుసుఫ్ పఠాన్ (1) రస్సెల్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో విజయ్ శంకర్ (39) బ్యాట్ జులిపించడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసింది. కోల్‌కతా బౌలింగ్‌లో రస్సెల్ రెండు వికెట్లు తీసాడు.