వైరల్ వీడియో: మొసలి డోర్ బెల్ కొడితే..!!

వైరల్ వీడియో: మొసలి డోర్ బెల్ కొడితే..!!

మీరు బయటికెళ్లి ఇంటికి తిరిగొచ్చే సరికి మీ సింహద్వారం ముందు ఒక భారీ మొసలి ఉంటే.. ఊహించుకోడానికే భయమేస్తోందా? ఇప్పుడు మొసలి ఇంటి గుమ్మంలో ఉండటమే కాదు మీ డోర్ బెల్ కొట్టడానికి ప్రయత్నిస్తే.. ఒళ్లు జలదరిస్తోంది కదూ.. అమెరికాలోని సౌత్ కరోలినాలో ఒక మహిళకు అక్షరాలా ఇదే అనుభవం ఎదురైంది. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం మిర్టల్ బీచ్ దగ్గర నివాసం ఉంటే కరెన్ అల్ఫానోకి ఇటీవల తన వాకిట్లో ఒక భారీ మొసలి తాపీగా సేద తీరుతూ కనిపించింది. ఆరున్నర అడుగుల ఆ మొసలి ఆవిడ ఇంటి కాలింగ్ బెల్ కొట్టేందుకు ప్రయత్నిస్తూ కెమెరాకు చిక్కింది. 

ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఆ షాకింగ్ వీడియోలో ఆ మహా మకరం గోడ ఆసరాగా పాకుతూ బెల్ ని చేరుకుంటోంది. ఆ వీడియోని మీరూ ఓ సారి చూడండి. 

ఇప్పటి వరకు ఈ వీడియోని ఆన్ లైన్ లో లక్షలాది మంది చూసి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. ఏబీసీ 11 కథనం ప్రకారం ఆ మొసలి గుమ్మం దాకా వచ్చేటపుడు దారికి ఇరువైపులా ఉంచిన షెల్ఫులను నేలమట్టం చేసింది. ఇంటి చుట్టూ తిరుగుతూ తన పదునైన వాడిగోళ్లతో గీరి గీతలు పెట్టింది. ఇంత విధ్వంసం చేసినా అదృష్టం కొద్దీ గాజు తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించలేదు. ఆ ఇంటావిడ ఫోన్ చేసి వన్యప్రాణి విభాగం సిబ్బందిని పిలిపించింది. వాళ్లొచ్చి ఈ మొసలిని పట్టి తీసుకెళ్లారు.