థోడా థోడా స్పైసీ బటర్ చికెన్ ఇష్టం: బ్రెట్ లీ

థోడా థోడా స్పైసీ బటర్ చికెన్ ఇష్టం: బ్రెట్ లీ

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీకి తన స్వదేశంలో ఎంత మంది అభిమానులు ఉన్నారో అంతకు మించిన అభిమానులు భారత్ లో ఉన్నారు. తరచుగా భారత్ కి వస్తుండే లీ.. రుచులు, అభిరుచుల విషయంలో దాదాపు భారతీయుడిగా మారిపోయాడు. ఓ వ్యాపార కార్యక్రమానికి వచ్చిన బ్రెట్ లీకి సీఎన్ బీసీ-టీవీ18 న్యూస్ ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు సంధించింది. రెండు చేతులు జోడించి నమస్తే చెప్పడంతో ప్రారంభించిన బ్రెట్ లీ మీరు హుక్ చేస్తారో, డక్ చేస్తారో చూద్దామంటే మీరే చూస్తారుగా అంటూ కౌంటర్ వేశాడు. ఇక చకచకా వస్తున్న ప్రశ్నలకు లీ కూడా తను విసిరిన సూపర్ ఫాస్ట్ బంతుల్లాగే టకటకా సమాధానాలు ఇచ్చాడు. మ్యూజిక్, క్రికెట్ లలో ఏది ఎంచుకుంటారంటే మ్యూజిక్ అని తడుముకోకుండా చెప్పాడు. క్రికెటర్ కాకపోతేనో అని అడిగితే రాక్ స్టార్ అయ్యేవాడిని అన్నాడు. బాలీవుడ్ సినిమాలో నటించాల్సి వస్తే మీ పక్కన హీరోయిన్ గా ఎవరు ఉండాలని కోరుకుంటారన్న ప్రశ్నకు నా క్లోజ్ ఫ్రెండ్ ప్రీతి జింటా అని లీ చెప్పాడు. తన క్రికెట్ ఐడల్ వైట్ లైటెనింగ్ గా పేరున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అలన్ డొనాల్డ్ అని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ బౌలర్లలో ది బెస్ట్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా అని పేర్కొన్నాడు. 20-20, వన్డేలు, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో తనకు 20-20 అంటే కొంచెం ఎక్కువ ఇష్టమని చెప్పాడు. ఎప్పుడూ ఆడేందుకు దేశవిదేశాల్లో పర్యటిస్తుండే తనకు ఫేవరెట్ హాలిడే ప్రదేశం ఇల్లేనని అన్నాడు. బటర్ చికెన్, థోడా థోడా స్పైసీగా ఉంటే చాలా ఇష్టమని తెలిపాడు. తనకు 1980లు, 1990ల నాటి పాప్ స్టార్ బాన్ జోవీ పాటలంటే ఎప్పటికీ ఇష్టమని చెప్పాడు లీ.