ఫ్యాన్ వెంటపడితే.. ధోనీ పరుగో పరుగు

ఫ్యాన్ వెంటపడితే.. ధోనీ పరుగో పరుగు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్చి 23 నుంచి ప్రారంభం అవుతోంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ)ల మధ్య జరుగుతుంది. సీఎస్కే జట్టుకి ఎంఎస్ ధోనీ నాయకత్వం వహిస్తుండగా ఆర్సీబీకి విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తున్నాడు. ఇందుకోసం రెండు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. హోమ్ గ్రౌండ్ లో ఇరు జట్లు చెమటోడుస్తున్నాయి. ప్రాక్టీస్ సమయంలో ధోనీ ఏం చేశాడో చూస్తే మీకు నవ్వాగదు. ఎంఎస్ ని తాకేందుకు ఒక వీరాభిమాని మైదానంలోకి పరిగెత్తుకొచ్చాడు. అతనికి అందకుండా ఉండేందుకు సీఎస్కే తలా కూడా పరుగు అందుకున్నాడు.

ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ లక్ష్మీపతి బాలాజీ దగ్గర నిలబడి ఉన్నాడు. ఒక ఫ్యాన్ గ్రౌండ్ లోకి ప్రవేశించి ధోనీ వైపు పరుగెత్తుకుంటూ రాసాగాడు. అది చూసిన ఎంఎస్డీ తను కూడా పరిగెత్తడం మొదలు పెట్టాడు. ధోనీ అందకపోవచ్చని నిరుత్సాహపడకుండా ఆ అభిమాని వెనుదిరిగి వెళ్లలేదు. తలాని ఎలాగైనా పట్టుకోవాలని పట్టుదలగా వెంటపడ్డాడు. ఇంతలో సెక్యూరిటీ అతడిని పట్టుకుంది. ఇది చూసిన ధోనీ తన పరుగుని ఆపి ఆ యువ అభిమాని దగ్గరకు వెళ్లాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ ఫ్యాన్ ధోనీతో ఒక ఫోటో కూడా దిగాలని ఉత్సాహపడ్డాడు. కానీ ధోనీ ప్రాక్టీస్ కోసం వెళ్లిపోయాడు.

భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో వన్డే జరిగినపుడు కూడా ధోనీ ఒక ఫ్యాన్ తన వైపు రావడం చూసి పరుగెత్తాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోనీ ఆ అభిమానికి అందకుండా చిరుతలా వేగంగా ఉరికాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఇద్దరిని మరింత ఉత్సాహపరిచారు. చివరికి ధోనీ స్టంప్స్ దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. పట్టువదలని విక్రమార్కుడి లాంటి ఆ ఫ్యాన్ పరిగెడుతూ ధోనీ దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు. ఇదంతా చూస్తూ ధోనీ బిగ్గరగా నవ్వేశాడు. తన అభిమానులతో ధోనీ ఎప్పుడు సరదా సరదా చేష్టలు చేయడం సర్వసాధారణంగా మారింది.