ధోనీకి చెన్నై వీరాభిమానుల ఘన స్వాగతం

ధోనీకి చెన్నై వీరాభిమానుల ఘన స్వాగతం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కి ఘన విజయాలు సాధించిపెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ అంటే చెన్నైవాసులకు ప్రత్యేకమైన అభిమానం. చెన్నైకి తిరుగులేని రారాజు ధోనీ అని ఎవరికైనా అనుమానాలు ఉంటే సీఎస్కే తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే తుడిచి పెట్టుకుపోవడం ఖాయం. తలా అని సీఎస్కే అభిమానులు ఆప్యాయంగా పిలుచుకొనే ధోనీ ప్రాక్టీస్ మ్యాచ్ లో బ్యాటింగ్ కి రాగానే ఎంఏ చిదంబరం స్టేడియం 'ధోనీ ధోనీ', 'తలా ధోనీ', 'తలా తలా' అనే నినాదాలతో మార్మోగిపోయింది. ఎంఎస్డీకి ఉన్న క్రేజ్ చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఐపీఎల్ 2019కి ముందుగానే తమ అభిమాన స్టార్స్ ని చూసేందుకు ఫ్యాన్స్ చెపాక్ స్టేడియంకి పోటెత్తారు.

బ్యాట్ పట్టుకొని ధోనీ మైదానంలోకి రాగానే స్టేడియం అంతా 'ధోనీ ధోనీ' నామస్మరణతో నిండిపోయింది. సీఎస్కే జట్టు సభ్యుల మధ్య జరుగుతున్న మ్యాచ్ ని చూసేందుకు వచ్చిన అభిమానుల సంఖ్య చూసి టీమిండియా మాజీ కెప్టెన్ షాకై పోయాడు. 

ఎంఎస్ కి లభించిన స్వాగతం చూసి మాజీ క్రికెటర్లు, జర్నలిస్టులు, ఫ్యాన్స్ నివ్వెరపోయారు. తమ స్పందనను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇక మాజీ స్టార్లు స్కాట్ స్టైరిస్, ఆల్బీ మోర్కెల్ తమ కళ్లని తాము నమ్మలేకపోతున్నామని చెప్పారు.

మరో సీఎస్కే స్టార్, చిన్న తలా సురేష్ రైనాకి కూడా అభిమానుల నుంచి అదిరిపోయే ఘనస్వాగతం లభించింది. ఈ శిక్షణ కార్యక్రమానికి రైనా కూడా హాజరయ్యాడు.

ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో ఇద్దరు మెగాస్టార్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రెండు వేర్వేరు జట్ల నుంచి ఒకరినొకరు ఢీకొననున్నారు. మార్చి 23న చెన్నైలో జరిగే ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో ధోనీ నాయకత్వంలోని సీఎస్కే, కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) తలపడతాయి.