వైరల్: కొడుకు రిసెప్షన్ లో నీతా అంబానీ డాన్స్

వైరల్: కొడుకు రిసెప్షన్ లో నీతా అంబానీ డాన్స్

ముంబైలో జరిగిన తన పెద్ద కొడుకు ఆకాష్ పెళ్లి రిసెప్షన్ లో నీతా అంబానీ అందరి దృష్టిని ఆకర్షించింది. ‘అచ్యుతమ్ కేశవమ్‘ అనే కృష్ణ భజనకు నీతా అందంగా నాట్యం చేసింది. నీతా అంబానీ నృత్య ప్రదర్శన ఏ బాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాకి తీసిపోని విధంగా కళ్లు చెదిరే ఫౌంటెన్లు, మిరుమిట్లు గొలిపే లైట్లు, భారీగా డాన్సర్లతో సాగింది. గులాబీ రంగు చీరలో నీతా అభినయం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆమె ప్రదర్శన ముగియగానే భర్త ముకేష్ అంబానీ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

ముకేష్, నీతా అంబానీల పెద్దకొడుకు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతాను ఆదివారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో అట్టహాసంగా జరిగిన వేడుకలో పెళ్లాడాడు. ఈ పెళ్లికి గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్, పారిశ్రామిక దిగ్గజాలు రతన్ టాటా, ఎన్ చంద్రశేఖరన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, శాంసంగ్, జేపీ మోర్గాన్ లకు చెందిన గ్లోబల్ ఎగ్జిక్యూటివ్స్, బాలీవుడ్ సూపర్ స్టార్స్ వంటి హేమాహేమీ అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఘనంగా సాగిన పెళ్లి తర్వాత అంబానీలు కొత్తగా పెళ్లయిన జంట కోసం పోస్ట్-వెడ్డింగ్ ఉత్సవాలను ముంబైలోని జియో వరల్డ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేశారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రేఖ, అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నా, జుహీ చావ్లా, ఐశ్వర్యారాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, వాళ్ల కూతురు ఆరాధ్య, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అతని భార్య అంజలి టెండూల్కర్, సంగీత దర్శకుడు అనూ మాలిక్, అతని కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమెరికాకు చెందిన పాప్-రాక్ బ్యాండ్ మెరూన్ 5 పెర్ఫామ్ చేసింది. 

ఆసియా కుబేరుల్లో ఒకడైన ముకేష్ అంబానీ పెళ్లికి ముందు విలాసవంతమైన 3 రోజుల ప్రీ-వెడ్డింగ్ వేడుకలను స్విట్జర్లాండ్ లోని సెయింట్ మోరిట్జ్ లో జరిపారు. ఈ హంగామాకు దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలంతా తరలి వెళ్లారు. అతిథులను ఆహ్లాదపరిచేందుకు మ్యూజిక్ సెన్సేషన్స్ కోల్డ్ ప్లే, ది చెయిన్ స్మోకర్స్ పెర్ఫామ్ చేశారు.