ఇక్కడితో ఆగం.. ఇంకా ఉంది: కోహ్లీ

ఇక్కడితో ఆగం.. ఇంకా ఉంది: కోహ్లీ

తమ విజయ పరంపరను ఇక్కడితో ఆపమని.. చివరి టెస్టులోనూ విజయం సాధిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. మెల్‌బోర్న్‌ వేదికగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో ఆసీస్ పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... మేము ఈ విజయంతో ఇక్కడే ఆగిపోము. ఈ విజయం ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇదే ఆత్మవిశ్వాసంతో సిడ్నీ టెస్ట్ లో కూడా విజయం సాధిస్తాం. గెలిచిన రెండు మ్యాచ్ లలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ రాణించాం. అన్ని విభాగాల్లో పైచేయి సాధించాం కాబట్టే.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తమ వద్దే ఉంటుందని కోహ్లీ చెప్పుకొచ్చారు.

ఆటగాళ్లపై వచ్చే కామెంట్లను పట్టించుకోబోనని.. అందరూ బాగా ఆడాలని కోరుకుంటానని కోహ్లీ అన్నారు. ఈ పిచ్ బౌలర్లు కోసం అనుకూలంగా ఉందని భావించాను. రెండవ ఇన్నింగ్స్ లో త్వరగా ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. 400 మంచి స్కోరు.. ఇది ఛేదించడానికి ఆసీస్ కు అంత సులువేం కాదు అని భావించి డిక్లేర్ చేశా. ఈ మ్యాచ్ విజయం బౌలర్లదే. బుమ్రా అద్భుతంగా రాణించాడు. కీలక సమయాల్లో వికెట్లను తీసి విజయాన్ని అందించాడు. అయితే దురదృష్టవశాత్తు పెర్త్ లో వికెట్లు తీయలేకపోయాడు. మన బౌలర్ల ప్రదర్శనతో కెప్టెన్ గా నేను గర్వపడుతున్నా. జట్టుకు అవసరం అయినప్పుడల్లా వికెట్లు తీసి విజయంను సొంతం చేసారు. మయాంక్, పుజారా బాగా రాణించారు. విహారి మొదటి 15 ఓవర్లు బాగా ఆడాడు. అందరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. ఇక తుది టెస్టును కూడా గెలవడమే లక్ష్యంగా ఆడతానని కోహ్లీ చెప్పారు.