'మేమెప్పుడూ చౌకీదార్ చోర్ హై అనలేదు':సుప్రీం

'మేమెప్పుడూ చౌకీదార్ చోర్ హై అనలేదు':సుప్రీం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు ధిక్కార కేసు విచారణ సుప్రీంకోర్టులో ప్రారంభమైంది. పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి లాయర్ ముకుల్ రోహత్గీని రాహుల్ వ్యాఖ్యలు ఏ విధంగా కోర్టు ధిక్కారమో రుజువు చేయాలని న్యాయస్థానం కోరింది. ఆ తర్వాత కోర్టు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ 'మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. ఇంతకు మించి వ్యాఖ్యానించకుండా ఆగుతున్నాం' అని కేసు విచారిస్తున్న బెంచ్ పేర్కొంది. 'మేమెప్పుడూ చౌకీదార్ చోర్ హై అని వ్యాఖ్యానించలేదు. దానిని మీరే మాకు జోడించారు. ఇప్పుడు దానిని సమర్థించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని' ఘాటుగా చెప్పింది. దీనిపై కోర్టు ధిక్కారం కింద చర్యలు చేపడతామని రాహుల్ గాంధీని కోర్టు హెచ్చరించింది.

మీనాక్షి లేఖి తరఫున హాజరైన న్యాయవాది ముకుల్ రోహత్గీ 'ఆయన తాను బాగా చదువుకున్నానని చెప్పుకుంటారు. కానీ తన అఫిడవిట్ లో మాత్రం తాను కోర్టు ఉత్తర్వులు చదివి, విశ్లేషించకుండానే వ్యాఖ్యానించానని చెప్పారు. మూడు గంటల తర్వాత వేరే ర్యాలీలో మరోసారి అదే మాట అంటారు. ఆయన దేని గురించి విచారం వ్యక్తం చేసినట్టు' అని ప్రశ్నించారు.

'మీ మాటలకు, అఫిడవిట్ లో పేర్కొన్న దానికి పొంతనే లేదు. ఒకచోట మీ వ్యాఖ్య తప్పేనని ఒప్పుకుంటారు. మరోచోట అలా అనలేదని అంటారు. మీరు అఫిడవిట్ ఆధారంగా వాదించడం ప్రారంభిస్తే మెరుగైన అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇవ్వబోమని' సుప్రీంకోర్ట్ రాహుల్ గాంధీకి గట్టిగా చెప్పింది. మెరుగైన అఫిడవిట్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని రాహుల్ గాంధీ కోరారు. చౌకీదార్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను సుప్రీంకోర్ట్ కి జోడించడం తప్పేనని రాహుల్ అన్నారు. తాను మూడు తప్పులు చేశానని, అందుకు క్షమాపణలు కోరుతున్నట్టు రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.