హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్ చేస్తాం..

హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్ చేస్తాం..

సుపరిపాలన అందిస్తాం.. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్ చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా... మేం ఏది చేస్తామో అదే చెబుతామన్నారాయన.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు రోడ్ షో తో స్పష్టమైంది.. మేయర్ బీజేపీదే అనే ధీమా వ్యక్తం చేశారు. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పై ఉంటుంది.. కానీ, హైదరాబాద్‌లో ఐటీ హబ్‌కి అడ్డంకి.. టీఆర్ఎస్, ఎంఐఎంల పాలనే కారణం అన్నారు. ఇక, వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు అమిత్‌షా.. ఇక, హైదరాబాద్‌లో ఆక్రమణలు చేసింది మజ్లిస్.. అందుకే వర్షంతో నిండి పోయిందన్నారు. చివరకు సీఎం నివాసం ఉండే సమీప కాలనీలు కూడా మునిగిపోయాయని విమర్శించారు. 

ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి చూడు.. లక్ష ఇళ్లు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు అమిత్‌షా.. లక్షా 35 వేల ఇళ్లను మంజూరు చేస్తే 11 వందలు కూడా కట్టలేదని ఆరోపించిన ఆయన.. 15 డంప్ యార్డ్స్ ఎక్కడ.. 10 వేలు కోట్లు ఎక్కడ ఖర్చు చేశావు.. హుస్సేన్ సాగర్ శుద్ధి ఎక్కడ? మూసిపై 6 లైన్ల రోడ్‌ ఏది.. హైదరాబాద్ చుట్టూ నాలుగు హాస్పిటల్స్ ఏమయ్యాయి అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీయే రెండు ఆస్పత్రులు కట్టించారన్న షా.. మరోవైపు.. రాజకీయ కారణాలతో ఆయుష్మాన్ భారత్ అమలు చేయడం లేదని విమర్శించారు. హైదరాబాద్ లో 30 వేల మంది వీధి వ్యాపారులకు లోన్ ఇచ్చాము.. 
ముద్ర రుణాల ఇచ్చాం అన్నారు అమిత్‌షా.. బయో డివర్సిటీ రీసెర్చ్ సెంటర్ ఇచ్చాము.. మోడీ పాలసీల వల్లనే భారత్ కి ఎఫ్‌డీఐలు.. ఐటీ సెక్టార్‌లో ఎక్కువ లాభం హైదరాబాద్‌కే అన్నారు. మోడీ పాలసీ వల్లనే ఇది సాధ్యం అయ్యిందని వెల్లడించారు. నవాబ్, నిజాం సంస్కృతి నుండి విముక్తి కల్పిస్తాం.. నయా హైదరాబాద్ ని నిర్మిద్దాం.. కుటుంబ పాలన నుండి ప్రజాస్వామ్యం వైపు, అవినీతి నుండి పారదర్శక పాలన వైపు
, సమగ్ర అభివృద్ధి వైపు పయనిద్దాం అని పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి.. మరోవైపు.. టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు పెట్టుకుంటే అభ్యంతరం లేదు.. చీకటి పొత్తు ఎందుకు అని ప్రశ్నించారు షా.. ఎంఐఎంతో పొత్తు ఉందని బహిరంగంగా ఎందుకు చెప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు అమిత్‌షా.. రోహింగ్యాల పై ఒవైసి పార్లమెంట్ లో అడ్డుకుంటున్నారు.. ఆయన లెటర్ ఇస్తే మేం ఏమి చేస్తామో చూడండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక, వరద సహాయం కింద హైదరాబాద్‌కి 500 కోట్లు ఇచ్చాం, రెగ్యులర్ గా సెక్రటేరియట్ కి వెళితే అన్ని తెలుస్తాయి అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి పక్ష స్థానానికి చేరుకున్నాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అని వ్యాఖ్యానించారు అమిత్‌షా.