ఆండ్రాయిడ్ యూజర్లకు వెబ్ మెసేజింగ్ సర్వీస్

ఆండ్రాయిడ్ యూజర్లకు వెబ్ మెసేజింగ్ సర్వీస్

కొన్నాళ్లుగా మెసేజింగ్ పై దృష్టి పెట్టిన గూగుల్, ఎట్టకేలకు వెబ్ నుంచి మెసేజెస్ పంపే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీంతో ఆండ్రాయిడ్ యూజర్లు తమ పీసీల ద్వారా మెసేజ్ లు పంపడం, పొందడం సులభం కానుంది. దీని ద్వారా ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, చాట్ చేయవచ్చు. వచ్చే వారం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. యాపిల్ ఐమేసేజ్ సర్వీస్ కి పోటీగా గూగుల్ తెస్తున్న ఆండ్రాయిడ్ మెసేజెస్ తో మెసేజింగ్ రంగంలో పోటీ మరింత తీవ్రతరం కానుంది.

ఆండ్రాయిడ్ మెసేజెస్ ఆండ్రాయిడ్ అధికారిక మెసేజింగ్ యాప్.  ఏప్రిల్ నెలలో గూగుల్ ఐమెసేజ్ కి పోటీగా ఈ యాప్ ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్ మెసేజెస్ ద్వారా వెబ్ మెసేజింగ్ చేయవచ్చని తన అధికారిక బ్లాగ్ ప్రకటించింది. ఈ కొత్త వెబ్ వర్షన్ టెక్స్ట్, ఇమేజెస్, స్టిక్కర్స్ వంటివన్నీ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఆండ్రాయిడ్ మెసేజెస్ లోని రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్)తో చాట్ సర్వీస్ లోకి ప్రవేశిస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్ వంటి డెస్క్ టాప్ వర్షన్స్ ఉన్న చాట్ యాప్స్ కి గట్టి పోటీ ఎదురవనుంది.

సరికొత్త ఆండ్రాయిడ్ మెసేజెస్ యాప్ అయితేనే వెబ్ మెసేజింగ్ సాధ్యమవుతుంది. వాట్సాప్ వెబ్ మాదిరిగానే పీసీలో ఆండ్రాయిడ్ మెసేజెస్ సైట్ కి వెళ్లి మొబైల్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దాంతో రెండిటి మధ్య లింక్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మెసేజెస్ ఫర్ వెబ్ ను సెలెక్ట్ చేసుకుంటే మీరు మెసేజెస్ పంపవచ్చు. అయితే ఇందులో చాటింగ్, కాంటాక్ట్స్, ఇతర సెట్టింగ్ లు బ్రౌజర్ లో ఉండిపోతాయి. అలాగే మీరు 14 రోజుల పాటు మెసేజెస్ అకౌంట్ ఉపయోగించకపోతే దానంతట అదే సైన్ ఔట్ అవుతుంది.